పంజరాన్ని నేనే
నాకు నేనే ఉచ్చును బిగించుకుంటాను
చిలుకపలుకులే తెలుసు
గొంతెత్తి పాడలేని మూగజీవాన్ని
కవిత్వం రాయాలని సమాజపు పక్షపాతాన్ని నిరసించాలని
నాలోని కోటానుకోట్ల కణాల యుద్దారావాల్ని
నాలోని విద్యుత్ ప్రవాహ గీతాన్ని
నాలోని ఆలోచనా లోచనాల సముద్రాల్ని వెలికితీసి
నాలోని నన్ను ఆవిష్కరిద్దామనే నా భావన.
కలలున్నాయి ,కాని అన్నీ డొల్లలే-
కథలున్నాయి,కాని ఎవరో పూర్తిచేసిన ముగింపులే-
కనులున్నాయి,కానీ ఎవరో కత్తిరించిన రేటీనాలే
సమాజంలో బతకని నువ్వు
నీ పుట్టుకా సమాధి పంజరమే అయిన నువ్వు
పంజరం ఊచలెన్నో లెక్కెట్టుకో !
కవిత్వం కవులే రాయగలరు-
నీకు అక్షరాలు ఏం తెలుసునన్న పురుషాహంకారం .
అవును! నాకు అక్షరాలు తెలియవు.
వాటి పోడిమాటలూ తెలియవు .
అసలు అక్షరాలేవి?
అయ్యో! వాటికి ప్రాణం ఏదీ?
ఎర్రటి రక్తంలో స్నానాలు చేస్తున్నాయవి !
వెలికి తీద్దామన్న యత్నంలో నా వేళ్ళు తెగి ఆ రక్తంలోనే కలిశాయి.
చేతులే లేని నేను
హత్యచేయబడ్డ అక్షరాలతో నేను
అసలు బాషే లేని నేను ఎలా మాట్లాడేది? ఎలా రాసేది?
***
నాచేతికి "మాడిఫై "చేయబడిన రూపంలో గాజులసంకెలలు
నా గొంతులో మూగే జూకాల్లా శబ్దాలు
నా బతుకే ధన్యమనే ''బ్రెయిన్ వాష్'' లు
నా నాలుక తెగ్గోసినా ,చేతుల్ని నరికేసినా
అక్షరాల్ని విరిచేసినా ,అసలు భాషను దగ్ధం చేసినా
నేను మరణించ లేదు.
నేను మరణించను
అవును! ఈ నెత్తుటిలో కొత్త పుట్టుక నాది.
ఈ పుట్టుక నా స్వంతం.
జనన మరణాల పట్టికను నేనే తయారు చేసుకోగలను !
ఎవరికీ నన్ను కాల్చడానికి ,కూల్చడానికి ,ముంచడానికి
వదిలేయడానికి ,ఉంచుకోవడానికి ,చంపడానికి ,ఎంచుకోవడానికి
సర్వహక్కులూ ధారాదత్తం చేయబడలేదు.
నేను వైప్లవ్య గీతిని...
మూగతనం తెలిసిన నాకు భాషెంత బాగుంటుందో తెలుసు.
కష్టాలలో మునిగి తేలిన నాకు కడసారి వీడ్కోలు కొత్త కాదు.
కన్నీళ్ళ నదులకి ఆనకట్టలు కట్టి
కొత్త వంతెనలు కట్టడం తెలుసు!
***
నేనొక ప్రాణినేనన్న గుర్తింపుకోసం
నేనొక సమిధగా కూడా మారతాను.
నన్ను నేనే నిలబెట్టుకోనేక్రమంలో
నా పాదాలక్రింద ఇసుకల జారిపోతున్న కుబుసాన్ని త్రునీకరిస్తున్నాను .
*** ***
భాషను దూరం చేసిన ప్రణాళికా కారులకు
నేనొక కొత్త నిఘంటువును!
బతుకును చౌరాస్తాగా మార్చిన వ్యాహహారికపు ముసుగులకు
నేనొక కంచు కత్తిని!
నేను తెగినా ,నేలరాలినా ,నెత్తురు చిమ్మినా
నేనొక మాట్లాడగలిగిన శక్తిని' అని నిరూపించుకుంటాను.
పోరాడటం నాకు కొత్తకాదు.
చాళ్ళనిండా విత్తనాలు మొలకెత్తడం ఇప్పటికే మొదలైంది !!
1999
లక్ష్మిగారూ, ఇపుడే చూసా మీ బ్లాగ్ ని .మా గురువుగారి బ్లాగ్ కన్నా మీదే బావుంది అభినందనలు.నా బ్లాగ్ మీద కూడా ఓ చూపు వేయండి.. jajimalli.wordpress.com
ReplyDeleteమల్లీశ్వరి.