Thursday, 21 July 2011

ప్లాస్టిక్ ! ప్లాస్టిక్ !!

ప్లాస్టిక్ నవ్వులు,ప్లాస్టిక్ పువ్వులు 
అలవాటైన మనం సహజత్వానికి దగ్గరవ్వాలంటే కష్టమే !
టీ గ్లాసుల్లో కరిగి కరిగి
కడుపులో మేటలైపోయినా ఫరవాలేదు .
గడ్డి దొరక్క రోడ్లమీద  ప్లాస్టిక్ కవర్లు కడుపార తినే పాడిఆవులు
నాయకులు తినేసిన గడ్డిని తలచుకుంటూ 
నెమరు వేస్తుంటాయి 
వాల్ పోష్టర్లు ,ప్లాస్టిక్ కవర్లు కసాపిసా నమిలేసే 
పశు పక్ష్యాదులు మనం సాధించిన అభివృద్ధికి కొలమానాలు.
ఆ పైన మనకోసం అవి గాలిలోంచి, నీటిలోంచి 
ధూళిలోంచి మిగిల్చిన వాటిని 
క్యాన్సర్ కానుకలుగా స్వీకరిస్తూ సంతోషపడాలి.
 
వేడి వేడి పాయా,బిర్యాని,చాట్ 
ప్లాస్టిక్ కవర్లలో కరిగి కరిగి వింత రుచులతో ఆరగిస్తే 
అదో ఆనందం ...
ప్లాస్టిక్ గరగరల శబ్దం 
గుండెను దడ దడలాడిస్తున్నా వేరే ఆలోచనను కూడా 
ఆహ్వానించం ! - ప్లాస్టిక్ బతుకులు కదా మనవి!!!
అసలైన రుచులు అంటే ఏమిటో 
ఇప్పుడు ప్లాస్టిక్ నే అడగాలి.

తెలిసి తెలిసి చేస్తున్న తప్పుకు 
ప్లాస్టిక్ కు  ఏ మాత్రం భాద్యత.
నిజమైన స్పర్శను,భాషను ,అనుబంధాల్ని 
ప్లాస్టిక్ గా మార్చుకున్నదే మనం.

ఇప్పుడు భూమిని ప్లాస్టిక్ తో నింపి 
జీవసారాన్ని జీవంలేకుండా మార్చేస్తున్న 
ప్లాస్టిక్ మనుషులం మనం. 
మనం ప్రేమించే మట్టిని ,పీల్చే గాలిని ,తాగే నీటిని 
స్వచ్చంగా బతికేటట్లు 
ప్లాస్టిక్ రహిత భాషలో సంభాషిద్దాం...

No comments:

Post a Comment