Friday 26 August 2011

కనకపుష్యరాగం


కనకపుష్యరాగం

భూమిక August 2011
డా.శిలాలోలిత
‘కనకపుష్యరాగం’ - పొణకాకణకమ్మగారి స్వీయచరిత్ర. చరిత్రలో స్వీయచరిత్రరాసిన స్త్రీలు బహుకొద్దిమంది మాత్రమే. చరిత్రకారుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తావనకు కూడా రానివారు అనేకమంది, ఇన్నాళ్ళకైనా, డాక్టరు కాళిదాసు పురుషోత్తంగారు సంపాదకులుగా వుండి ఈ స్వీయచరిత్ర వెలుగుచూడడానికి కారకు లయ్యారు. ఆంధ్రదేశంలో స్వాతంత్య్రోద్యమచరిత్రను రాసే చరిత్ర కారులు, ”నెల్లూరులో పొణకా కనకమ్మ ఖద్దరు గుడ్డలు అమ్మిందనీ, గాంధీజీకి బంగారు గాజులు తీసిఇచ్చిందనీ, ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్లిందనీ ”ఒక వాక్యం రాసి మొక్కు తీర్చుకున్నాను. అంతేనా… కనకమ్మ; అదేనా చరిత్రలో ఆమె స్థానం? కాదు. కానేకాదని నిర్ద్వంద్వంగా నిరూపిస్తుందీ స్వీయచరిత్ర. కనకమ్మది కొత్తబాట. తనంతట తానువేసుకొన్న బాట కావడంవల్ల దారిపొడవునా రాళ్ళూ, ముళ్ళూ, ఐనా ఆమె నడక కుంటుపడలేదు. నెల్లూరు జిల్లాలో పోట్లపూడి అనే చిన్నపల్లెలో బాల్యం, యవ్వనం గడిచినా, ఆమె తననుతాను ఆధునిక మహిళగా రూపొందించుకొంది. భూస్వామ్యకుటుంబంలోని ఆంక్షలన్నిట్నీ ఆమె ఎదుర్కొంది. ఐనా సరే ఆమె ఏ క్షణంలోనూ స్థాణువు అయిపోలేదు. జీవితమంతా చైతన్యమే; అలుపెరుగని, ఓటమికి తలవంచని ఒంటరి పోరాటమే. ఈ స్వీయచరిత్రను యథాలాపంగా కాకుండా పరిశీలనాత్మకంగా చదవండి. ఇది వట్టి ఘటనల పోగు కాదు. ఒక్కొక్క సంఘటన వెనక అచంచలమైన కనకమ్మ ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వం కనబడతాయి. స్వచ్ఛమైన మంచితనం పలకరిస్తుంది. కంటనీరు పెట్టిస్తుంది. (పేజి 3 - పెన్నేపల్లి గోపాలకృష్ణ) కనకమ్మ చనిపోయినప్పుడు వెన్నెలకంటి రాఘవయ్య ఇట్లా రాశారు. ”కనకమ్మ ఆర్థికకష్టాలతోపాటు మానసిక, శరీరకష్టాలను కూడా ఎన్నిటినో అనుభవించింది. మొదట ఆస్తినష్టము, తరువాత ప్రేమించిన భర్త వియోగము, అనుంగు కుమార్తె అకాలమరణము - వీటన్నింటికన్నా తాను సృష్టించి, పెంచిన కస్తూరిదేవి విద్యాలయము తన పెత్తనము నుండి జారిపోవడము - ఆమె ఆరోగ్యాన్ని ఆయువును కృంగదీసినవి. కనకమ్మది రైతుకుటుంబమే కాని, రాజకీయకుటుంబం కాదు. ఐనా రాజకీయ చైతన్యం ఆమెలో మూర్తీభవించింది. గడపదాటి రాకూడదు; స్వాతంత్య్రోద్యమంలో ఆమె చేపట్టని కార్యక్రమం లేదు. గాంధీజీ ప్రభావానికి ఒదగక ముందు, 1915లో మద్రాసులో ఓ.వి. చిదంబరం పిళ్ళె, గుంటూరులో ఉన్నవలక్ష్మీనారాయణలాంటి తీవ్రవాదులతో చేతులు కలిపి, రహస్యంగా పిస్తోళ్ళు, బాంబులు దిగుమతి చేసుకొని ”సమయం కోసం వేచి వుండిన” సాహసి ఆమె. గాంధీజీ ప్రభావానికి లోనైనతర్వాత ఆమెలో వచ్చిన మార్పును గమనించాలి. హరిజనుల కొరకు పొట్లపూడిలో స్కూలు పెట్టింది. రాట్నం వడికింది, అహింసను ప్రచారం చేసింది. మాదిగవాడలో కలరా సోకితే స్వయంగా చికిత్స చేస,ి మాలవాడలో విషజ్వరాలు ప్రబలితే మందూమాకు అందజేసి ఆదుకుంది. ఖద్దరు బట్టలు భుజాన వేసుకుని నెల్లూరులో వీధివీధి తిరిగి అమ్మింది. కస్తూరిదేవి విద్యాలయం ఆమె మహోన్నత వ్యక్తిత్వానికి సంస్థారూపం. నిరుపేదల, దళిత బాలికల కోసం స్కూలు స్థాపించడం ఆమె ఆశయం. కష్టకాలమంతా ఆమెతోనే గడిచింది. ఆమె ఊహించనంత ఉన్నతంగా సంస్థ పెరిగి, ప్రఖ్యాతికొచ్చిన తర్వాత ధనికస్వాముల పాలైంది. ఈమె రచనావ్యాసంగం ఇరవైఏళ్ళ వయస్సులోనే ఆరంభమైంది. శశిరేఖ, హిందూసుందరి, అనసూయ వంటి పత్రికల్లో పద్యాలు, వ్యాసాలు రాశారు. ‘చెట్టు నీడ ముచ్చట్లు’ పేరుతో వ్యాసాలు రాశారు. 1920 ప్రాంతంలో ‘రాణి పద్మిని’ అనే చారిత్రక నవల రాశారు. హిందీ నుండి తెలుగుకి అనువాదాలు చేశారు. పొణకా కనకమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మలు, తెలుగులో తొలిజంట కవయిత్రులుగా స్తుతిగీతాలు రాశారు. 1920 నుంచి 1935 వరకు అత్యంత సేవాత్యాగాలు చేసిన స్త్రీల ఉద్యమచరిత్రను ప్రత్యేకంగా గ్రంథస్థం చెయ్యాలనే ఆలోచన, ఈ రచయిత్రుల స్త్రీవాదదృక్పథాన్ని తెలియజేస్తోంది. కనకమ్మలోని స్త్రీవాదదృక్పథం ఆమె స్వీయచరిత్ర రచించడానికి పూనుకోవడంలోనే వ్యక్తమైంది. ‘స్త్రీలు రాజకీయాల్లో పాల్గొనవలసినదే’ - స్త్రీలు సంకల్పిస్తే ఎంత పనైనా చేయగలము. ఒక పత్రికా నిర్వహణమునే కాదు రాజ్యాంగమునే శాసించగలము” అని స్త్రీశక్తి మీద గొప్ప విశ్వాసం ప్రకటించారు. పురుషోత్తం గారి కృషి వల్ల కనకమ్మగారి స్వీయచరిత్రను మనం చదవగలుగుతున్నాము. ఇందులో ప్రధానంగా 8 భాగాలున్నాయి. 1. మృత్యోర్మా అమృతంగమయ, 2. ఆ దినాలు ఇంకరావు 3. చీకటివెలుగులు, 4. నా రాజకీయ జీవితం, 5. మహాత్మునితో పరిచయభాగ్యం, 6. ఆశ్రమవాసం, 7. శ్రీ కస్తూరీదేవి విద్యాలయం చరిత్ర, 8. అనారోగ్యపర్వం. నెల్లూరు నగరంలో ఎవరెవరివో విగ్రహాలు వున్నాయి. కానీ కనకమ్మ విగ్రహం లేదు. ఎందుకు? కస్తూరీదేవి విద్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడానికి తయారుచేయబడిన కనకమ్మ కాంస్య విగ్రహం ఆ మూల ఒక చీకటిగదిలో ముప్పయ్యేళ్ళుగా మూలుగుతోంది. ఇప్పటికైనా స్థానికులు వెలికితీసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇది అందరం చదవాల్సిన గొప్ప పుస్తకం. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వమున్న స్త్రీ జీవిత దర్శనమే ఇది.

Wednesday 24 August 2011

స్త్రీల చైతన్యానికి ప్రతీకలు ఈ కథలు

స్త్రీల చైతన్యానికి ప్రతీకలు ఈ కథలు

భూమిక June 2011
డా.శిలాలోలిత
స్త్రీల హక్కులగురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి తన గొంతును వినిపిస్తూ, ఆ దిశలో కృషి చేస్తున్న జీవనయానం ఆమెది. కొండవీటి సత్యవతిలో చిన్నచిన్న సంఘటనలను కథలుగా మలిచే నేర్పు వుంది. తాత్త్వికత, ఆర్ద్రగుణం, స్పష్టత, సూటిదనం ఈమె కథలను, సాధార ణమైన కథలుగా కాక, చర్చనీయాంశమైన కథలుగా నిలుపుతున్నాయి.
పాత్రల్లోకి ప్రవేశించి వాటిలోని ఘర్షణను, నిబద్ధతను రూపొందించే నైపుణ్యం వలన, కథల్లో ఎన్నుకొన్న పాత్రలు ఘర్షణ నుండి ఏర్పడిన తాత్వికాంశతో మన ముందు నిలబడతాయి. తమనుతాము స్థిరంగా నిలుపుకుంటాయి, కథలోని వస్తువును తేలికగా పాఠకుడు అర్థంచేసుకునే సౌలభ్యంతో పాటు, కథకురాలి ప్రాపంచిక దృక్పథమేమిటో  కథల్లో స్పష్టంగా తెలుస్తుంది.
పాఠకుడికి ఇవన్నీ తన చుట్టూ రోజూ జరుగుతున్నవేనని, కన్పిస్తున్నవేననే భావన కలగడంతో పాటు, తాను ఆయా ప్రత్యక్షపరోక్ష సందర్భాల్లో స్పందించి వ్యవహరించే తీరును గుర్తుచేసుకుని, ఆత్మవిమర్శ చేసుకునే అవసరాన్ని  ఈ కథలు కలగజేస్తాయి. దీనివల్ల కథల్ని ఎవరికి వారు తమ కథలుగా, సజీవమైన జీవితానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా భావించుకునే స్థితివుంది. ఇదంతా కథకురాలి రచనాశిల్పం వల్లనే సాధ్యమైంది. స్థలకాలాల పరిమితుల్నిదాటి పరిశీలించిన కథలుగా మాత్రమేకాక, మనిషి అంతర్లోకాల సంఘర్షణని రచయిత్రి ఆవిష్కరించడం ఇందువల్లనే సాధ్యమైంది.
ప్రత్యేకంగా ఇందులోని స్త్రీ పాత్రల గురించి ప్రస్తావించాలి. ‘విందుతర్వాత’… కథలోని మాధవి, ‘సౌందర్యీకరణహింస’లో అరుణ, ‘గూడు’లో చందన, ‘గంగకు వరదొచ్చింది’లో గంగ, ఈ  పాత్రలు తమచుట్టూ జరుగుతున్న అన్యాయాల్ని చూడలేక ప్రశ్నించడానికి ఉద్యుక్తమయ్యే పాత్రలు. మాధవి ఆదర్శంగా చూపబడుతున్న అంశాల్లోని చీకటి కోణాల్ని అసహ్యించుకుంటుంది. తెచ్చిపెట్టుకున్న ఔదార్యాలలోని డొల్లతనాల్ని, మానవత్వం పేరుతో చెలామణి  అవుతున్న అంశాల్ని చర్చలోకి తెస్తుంది. చందన-అరుణల పద్ధతి కూడా ఇదే! ఇళ్ళు కట్టించే ప్రభుత్వపథకాలవల్ల సగటుమనిషి ఎదుర్కొంటున్న సమస్యలు, నీడకోసం పాకులాడుతూ, కూడే లేని పరిస్థితిలోకి నెట్టబడటం వంటి సూక్ష్మమైన అంశాలవైపు చందన దృష్టి మరల్చి, చర్చలోకి తెస్తుంది.
‘అరుణ’ మనిషితనంపై లేవనెత్తిన ప్రశ్నలు సామాన్యంగా అనిపించినా సామాన్యమైనవి మాత్రమే కావు. కనీసవసతులు కరువైన జీవితాలవైపు దృష్టి సారించమనే విషయాన్ని చర్చకు పెట్టడంతోపాటు, ‘అభివృద్ధి’ నినాదంతో సాగుతూ ప్రభుత్వాలు ఏయే వాస్తవకోణాల్ని విస్మరిస్తున్నాయో చూపడం అరుణలోని అసలు లక్ష్యం. ఆ లక్ష్యం కోసం గొంతెత్తడం మినహా మరోదారి లేదంటుంది. ‘గంగ’ పాత్రలోని సంఘర్షణ నుంచి చర్చకు వచ్చే అంశం, స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలోని అడ్డంకులు. పథకాలు ఎంతగా స్త్రీలలోని మానసిక ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయో చూపుతాయి. అంతే కాకుండా, తరతరాలుగా స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కావాల్సిన మానసికప్రపంచం సంసిద్ధమై లేకపోవడం, అందువల్ల ఎదురవుతున్న పరిస్థితులు. అటువంటి స్థితి వల్ల ఒకడుగు ముందుకు వేసినట్లు కన్పిస్తుంది. ఈ కథలో గంగ, ఆదెమ్మ వంటివారు ఎదుర్కొన్న పరిస్థితులు ఇందులోని భాగమే. డ్వాక్రా పథకంలో ముందుకు వేసిన అడుగులు, మైక్రోఫైనాన్స్‌ విషయంలో అవగాహన కొరవడటం వల్ల వెనకడుగులు వేయడం గమనించవచ్చు. స్త్రీలకు నాయకత్వ నైపుణ్యం వున్నా, అవగాహనచైతన్యం రూపుదిద్దకుండా, పథకాల్ని ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే దుష్పరిణామాల్ని గంగ మానసికసంక్షోభంలో చూడవచ్చు.
ఈ పాత్రలు సామాజిక అంశాలను చర్చకు పెట్టినవి అయితే, స్త్రీల జీవితాల్లోని అంతర్లోకాలను, పాలపుంతలోని మధుర, ‘చీకటిలోంచి చీకటిలోకి’ లోని ఊర్మిళ. ‘ఐతే’ లోని జానకి పాత్రలలో చూడవచ్చు. హెచ్‌.ఐ.వి. బారిన పడిన మధురలోని మానసిక పరిపక్వత, స్త్రీపురుషుల మధ్య నెలకొనాల్సిన అపురూపమైన ప్రేమను నిర్వచించగలిగిన స్థిరచిత్తం అబ్బురపరుస్తాయి.
”సంతోషం ఎప్పుడూ మన చుట్టూనే వుంటుంది. దాన్ని గుర్తించడంలోనే వుంది మన తెలివంతా” అంటుంది - ‘మధుర’. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల్ని కూడా మరిచిపోయేంత జీవననానుకూల దృక్పథం ఈమెలో తొణికిసలాడుతుంది. అందువల్లే తనలాగే వ్యాధి బారిన పడిన -వయసులో తనకన్నా చిన్నవాడైన యువకుడితో సహజీవనం చేయడం కోసం సన్నద్ధమైంది. ఆత్మవిశ్వాసప్రతీకగానే కాక, జీవితపు ఆర్ద్రమైన ఆత్మీయకోణం ఏమిటో ఈమె మాటల్లోంచి కూడా ఆమె జీవనానందాన్ని ప్రోది చేసుకో గలుగుతుంది. ‘చీకట్లోంచి చీకటిలోకి’లో ఊర్మిళ ఆచారవ్యవహారాల వ్యవస్థలోని లోపాలను, తప్పనిసరితనంలోని విసుగును కప్పి పుచ్చుకుని కుటుంబం కోసం నిలబడుతుంది. పైకి నోరెత్తకుండా వున్నట్లువున్నా ఆమెలో లోలోపలి పెనుగులాటను, కుటుంబవ్యవస్థలో స్త్రీ స్థితికి ప్రతీకగా చూడవచ్చు. ఏ భర్త క్షేమంకోసమైతే తాను అనారోగ్యంగా వున్నా, వ్రతం చేసిన నాగలచ్మి, అదే భర్త చేతుల్లో దెబ్బలు తిని చనిపోతుంది. ఇవన్నీ నేటి స్త్రీ పరిస్థితికి వాస్తవరూపాలు. ఆచార వ్యవహారాలోని లొసుగుల్ని చూపడంతో పాటు, అందులో భాగంగా స్త్రీల మానసికతను దర్శింపచేయడం ద్వారా కథాలక్ష్యం నెరవేరింది.
‘ఐతే- కథలో జానకి పాత్ర స్త్రీవాదప్రతీక. తమ ప్రేమ రాహిత్యంతో బతుకువెళ్ళమార్చలేక పెనుగులాడుతున్న స్త్రీలకు ప్రతీక. తాను యిష్టపడిన బాలసుబ్రహ్మణ్యంతో అరవై ఏళ్ళవయసు వచ్చినా, జీవితం పంచుకోవడానికి సిద్ధపడుతుంది. దీనివెనుక గడిచిన జీవితసంఘర్షణ వుంది. భార్యగా తాను పడిన మానసికసంక్షోభం వుంది. పురుషుడి వైపే అన్ని వేళలా మొగ్గు చూపే సమాజవ్యవస్థ ప్రభావం వుంది. పురుషుడి లోపాలను కూడా సహించగలిగిన సానుకూలవ్యవస్థ వుంది. పురుషుడికి లేని, స్త్రీకి మాత్రమే వర్తింపజేసే  నీతిసూత్రాల వల్లింపు వుంది. వీటన్నింటినీ నిరాఘాటంగా అమలుపరిచే పితృస్వామిక అధికారపు హంగువుంది. వీటిని ఎదిరించే తెగువను జానకి ప్రదర్శించి, దానివల్ల ఎదురైన కష్టనష్టాల్ని ఎదుర్కొని, ఒక్క కూతురుతప్ప తనకు తోడు నిలవని స్థితిలో సైతం తాను కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతుంది. కూతురి అండ కేవలం ఆ సందర్భంలోకి పరిమితమై చూడలేం. స్త్రీ ముందడుగులోని భవిష్యత్తును దర్శింపచేసిన ప్రతీకగా కూతురిని చూడాలి.
స్త్రీవాద ఉద్యమం లేవనెత్తిన అంశాలు, ఉద్యమించిన సందర్భం, స్త్రీ స్వేచ్ఛ కోసం ఎడతెరిపి లేకుండా జరుగుతున్న చర్చల నేపథ్యం - ఈ కథకు ప్రేరణలు. సత్యవతి ఈ కథను ముగించిన తీరు ప్రశంసనీయం. తరాల తర్వాత స్త్రీ సగర్వంగా నిలదొక్కుకునే స్థితికి చేరుకుంటుండడం వెనుక వున్న సంఘర్షణకు అద్దం పట్టింది ఈ కథ.
”నేను దుఃఖంలోంచి సుఖంలోకి, స్వేచ్ఛలోకి వెళ్ళాలను కుంటున్నాను. నన్ను ఆపకండి. నాకు విడాకులు కావాలి” జానకి 60 ఏళ్ళుగా తనలో దాచుకున్న పెనుగులాటలోంచి సాధించుకున్న స్వేచ్ఛకు ప్రతిరూపమైన మాటలివి. ఈ మాటల సారాంశం స్త్రీవాద ఉద్యమం ఎగరేసిన బావుటా.
‘ఎగిసిపడిన కెరటం’ - కథ ఒక ఉద్వేగతరంగమే. మనం కూడా అనసూయత్త జీవితంలోకి నేరుగా ప్రవేశిస్తాం. సంఘర్షిస్తాం. విచలితులమవుతాం. పరిష్కార మార్గంతో ఏకీభవిస్తాం. అలాగే, ఆదర్శాలు కరిగిపోయి రమేష్‌లోని అసలురంగు బయటపడినప్పుడు భార్యగా కొనసాగలేననే నిర్ణయం తీసుకున్న అరుణ, ఆ నిర్ణయం తీసుకోవడంలో చూపిన తెగువ ‘మెలకువ సందర్భం’ కథలో కన్పిస్తుంది. ఎక్కడా తన జీవితం మీద తనకు నమ్మకం లేనితనం కన్పించదు. అలాగని భవిష్యత్తులో ఏమైపోతానో అనే దిగులులేదు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడేతనం అరుణలో నిండివుంది. అందువల్లే జానకిలా జీవితచరమాంకం వరకూ ఎదురుచూడకుండా తాను ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో తక్షణమే అవగాహన చేసుకుని, దాని కనుగుణంగా తాను తీసుకోదగిన నిర్ణయం వెనువెంటనే తీసుకొంది. ‘హమ్‌ చలేంగే సాథ్‌ సాథ్‌’లో కలిసి జీవించడానికి ముందే, చర్చించుకోవడం, జీవనసాఫల్యాన్ని సాధించుకున్నదిశగా పయనించడం స్పష్టంగా కన్పిస్తుంది. తరాలు మారుతున్న కొద్దీ స్త్రీ మానసికంగా దృఢమవుతున్న పరిణామాన్ని ఈ మూడు పాత్రల్ని విశ్లేషించుకుని రూఢిపరచుకోవచ్చు.
స్త్రీవాద దృక్పథంతో, చైతన్యంతోవున్న ఈ కథల్లోని స్త్రీలు, పిరికివాళ్ళు కాదు. సర్దుకుపోయే గుణాలు లేవు. ప్రశ్నించడం నేర్చుకున్న వాళ్ళు. గొప్ప చైతన్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంకోసం, స్వేచ్ఛకోసం, తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలిగే తెలివైన స్త్రీలు, బుద్ధిజీవులు, అంతర్గతచైతన్యాన్నుంచి, ఘర్షణ నుంచి జీవితసాఫల్య నవనీతాన్ని సాధించుకున్న ధీరవనితలు. సమాజంలో నేడున్న స్థితిలో స్త్రీలు తమతమ జీవితాలను మణిదీపాలుగా వెలిగించుకోవడమే కాక, తోటి స్త్రీల బ్రతుకుల్లో కూడా ఆత్మవిశ్వాసం తొంగిచూడాలనే ఆకాంక్షను ధ్వనిస్తాయి ఈ కథలు.
కొండవీటి సత్యవతి కథకురాలుగా చూపిన పరిణితిని ఈ పై కథల్ని చర్చించడం ద్వారా ఎత్తిచూపడం నా ఉద్దేశ్యం. అంతేకాక చర్చనీయాంశాలైన అనేక సమస్యల్ని ఈమె కథావస్తువులుగా ఎంచుకొని, ఏరుకున్న సంకేతాలుగా ప్రదర్శించి చూపారని చెప్పడం మరో ఉద్దేశ్యం.
‘భూమిక’ స్త్రీవాదపత్రిక సంపాదకురాలుగా, హెల్ప్‌లైన్‌ నిర్వాహకు లుగా మహిళా ఉద్యమంలో భాగస్వామిగా దశాబ్దిన్నర కాలంనుండి పనిచేస్తూ వికసనం చెందిన మానసిక ప్రపంచాన్ని ఈ కథల ద్వారా ముందుకు తెచ్చారు కొండవీటి సత్యవతి. ‘ఉత్తమ జర్నలిస్ట్‌ అవార్డ్‌’, సంపాదకీయాలకు ఉత్తమ ‘లాడ్‌లీ’ అవార్డ్‌, జెండర్‌ సెన్సిటివిటీకి ‘నేషనల్‌’ అవార్డ్‌, ‘ఆమెకల’ కథాసంపుటికి ‘ఉత్తమరచయిత్రి’ అవార్డ్‌ (తె.యూ.) రంగవల్లి అవార్డ్‌ వంటి ఎన్నో ఈమె సాహితీకృషికి మచ్చుతునకలు మాత్రమే.
పరిణిత దృక్పథంతో పాటు, అనువైన రచనాశిల్పంవల్ల ఈ కథల్లో వస్తువుగా తీసుకున్న అంశాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. చర్చను ప్రేరేపిస్తాయి. కథలలోని వస్తువులు సుపరిచితంగా కన్పించినా, వాటిని మలిచిన తీరువల్ల ‘అట్టడుగున కాన్పించని కోణాలెన్నో దర్శించే అవకాశం ఈ కథలలో కలిగింది. జానకి, మధుర, వసుధ, చందన. వసంత, అనసూయ, ఊర్మిళ, సంహిత, నాగలచ్మి, విశాల, అరుణ పేరేదైతేనేం? అందరూ ఒక్కరూపాన్ని ఒకే రకమైన బాధని, ఒకేరకమైన వివక్షని, అణచివేతని, ఒక రకమైన భావజాలాన్ని తొడుక్కొని మనముందున్న అసలు సిసలైన ప్రతీకలు. మీరూ ఓ సారి వాళ్ళ ఈ జీవితపు మారుమూల పార్శ్వాలను చూద్దురుగాని రండి. వాళ్ళే మీకు సమస్తాన్నీ వివరించుకుంటూపోతారు.

Tuesday 16 August 2011

కొత్త ఇళ్ళు కట్టుకుందాం

ఆమె ఒక మతం
అతడు ఒక మతం
కాలాతీత మతాతీతం అభిమతం
మధ్యన ద్వీపంలా సంతానం

మోహావరనంలా తప్పిపోయిన  శరీరం
జీవితంలోంచి తొంగిచూస్తుంది
జనాభాలెక్కల్లో తేలని మతాలమధ్యన
ఒక మతంగా జన్మెత్తాడు ఓ శరీరాన్ని పంచుకుని -

ఈ చిన్నారి ప్రశ్నలకు
హిందూ,ముస్లిం,సిక్కు గడుల 'సెన్సెస్ చార్టు'
జవాబులకోసం వెతుక్కుంటుంది
దొరకని జవాబులకోసం
చిన్నారి జీవితాంతం అన్వేషించాలా?
ముఖం చెక్కేసిన'బహామియన్' బుద్దుడిలా
మతముఖంలేని నా రక్తంలో రక్తం.....

ప్రేమికులారా!
మోహంలోనూ  మతాన్ని చూడండని ఇక ఉద్యమాలు లేవదీద్దాం
మతాల్నే ప్రేమించమని దేహాలతో మొరపెట్టుకుందాం
ముఖం వెనుక దాగిన చూపులకు
మతకచ్చడాలు బిగించమని మతపెద్దల్ని అడుగుదాం

దేహంకూడా ఒక మతమేనని చాటుదాం

మృత్యువులోంచి కూడా కళ్ళు తిప్పుతూ
ప్రశ్నించడం మానని మతం !

దంపతులారా!
మన ప్రేమలకు ఈ ఇళ్ళు చోటివ్వలేవు
మన ఇళ్ళు మనమే నిర్మించుకుందాం.

@.@
                                                                                     

Friday 5 August 2011

గోరటెంకడి పాట

వాగ్గేయకారులెలా ఉంటారు !?
చింతాకంతే వుంటారు 
చిరస్మరనీయులై నిలుస్తారు 

ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య
ఒక త్యాగయ్య, ఒక మీరా 
ఇదిగో ఇక్కడ 
తెలంగాణా భూమిని తొలుచుకుని గోరటి వెంకన్న!

అతడి నోటినిండా పల్లెపదాలు
పాట ఎత్తుకుంటే పల్లె మన ముంగిట నిలుస్తుంది 
పదబంధాలు,ప్రతీకలు బంతిపూలై నవ్వుతాయి.
కళ్ళు ఎగిసిన అలలై మెరుస్తాయి 
ఊరుతల్లి ఇంటిముంగిట ముగ్గవుతుంది 
చెట్టూ చేమా , కాయాకసరూ 
ఉప్పూనిప్పూ కరువూ కష్టం
చేలెంబడి ,డొంకలెంబడి తిరుక్కుంటూ పాటల్లా నడుస్తాయి 

ఊరోళ్ల ఊసులు సంతలకధలు వెతలు రాములయ్య బతుకుభాగోతాలు హరిశ్చంద్రుడి కాటికాపరి దుక్కం 
కన్నీరొక చుక్కుండిన చాలునన్న వేదాంతాలు ఆలుమగల్ల రాద్దంతాలు సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మలు 
డెంకదేడ్డెం 'అంటూ లేగాదూడలైన పిల్లకాయలు కనిపించని కుట్రల్లో పల్లెకన్నీరు పెడుతుందని దృశ్యమానం 
చేసే పాటల మాటల ఊటల ఆవేదనార్తుల కలబోతల ఒక అనంత ప్రవాహం ఆతడి పాట.చదువుకున్నోళ్ళ
ఉన్నోళ్ళ ,ఉన్నున్నోళ్ళ నోటెంట పలికే గిలికే రాతలే నిజమంటున్న కాలంలో -బతుకుబండిలో పల్లెనేక్కించిన
జానపద సాహిత్య రారాజు అతడు.

అతడొక ఉద్యమం ,అతడొక ప్రవాహం ,పరీవాహకం
అతడి గుండె ఒలికిన పాట పోటెత్తిన అల
'వేమన'లా ప్రతీకలని చుట్టూ చూస్తూనే 
ఒడిసిపట్టుకుని విత్తనాల్లా వెదజల్లుతాడు 
చరణాల నాగటిచాల్లలో ఏం పోలిక రువ్వుతాడో తెలీదు
ఎవరి గుండె పిగులుతుందో తెలీదు 
అతడినోట ప్రతి పాట ఓ బతుకుగుండం ,జీవన్మరణ పోరాటం
అంతర్గత సంక్షుభిత విలయనృత్యం

తెలంగాణ కన్నమట్టిబిడ్డ,మరో బిడ్డ 
కన్నతల్లి కనుకొలకులలో మెరుపై నిలిచే నెత్తుటి గుండం!