Saturday, 30 July 2011

చూపులు

కన్ను తడిగుండెల మడతల్ని
విప్పుతూ వుంటుంది 
ఆ రెప్పలకు 
బతుకుమూత మూయడమూ తెలుసు 

కన్రెప్పల దారాలతో 
ఒక్కొక్క గాయాన్ని కుట్టుకోవడమూ తెలుసు 
అంతరంగ యుద్దాల్లో 
నెత్తురోడిన జీరల్ని దాచుకోవడమూ తెలుసు 

నల్లటి అశాంతుల ఆవర్తనాల్ని 
శ్వేత బిందువులతో సమర్ధించడమూ తెలుసు 
1
చంక్రమనాలు చేసే బతుక్కి
చూపై, స్థిరమై, నిలిచే అభివ్యక్తి .
ఎదురు చూపుల్లోంచి ,బతుకు చూపుల్లోంచి 
బతుకంతా ఎదురుచూడ్డం అంటే 
ఒక జీవిత సాఫల్యం చేకూరినట్లు -

అలజడుల ఊపిరుల నడుమ 
కాలాన్ని కొలవడం ఒక యుద్దమే!
అశాంతి మాత్రమే చూపుల్లోంచి కరుగుతుంది ,
కాలాన్ని కదుపుతుంది 
ఎడారుల నిశ్శబ్దం 
ఎండుటాకుల పైనుంచి లేచిన చిరుశబ్దం
ఊపిరినుంచి ఎగిసిన నిట్టూర్పు-
                            అన్నీ చూపులే! 
అన్నట్టు, లోచూపు ఇప్పుడే వెలిగింది.
అన్నీ -చిత్రాలే ఇక !!!


+ + +

Thursday, 21 July 2011

ప్లాస్టిక్ ! ప్లాస్టిక్ !!

ప్లాస్టిక్ నవ్వులు,ప్లాస్టిక్ పువ్వులు 
అలవాటైన మనం సహజత్వానికి దగ్గరవ్వాలంటే కష్టమే !
టీ గ్లాసుల్లో కరిగి కరిగి
కడుపులో మేటలైపోయినా ఫరవాలేదు .
గడ్డి దొరక్క రోడ్లమీద  ప్లాస్టిక్ కవర్లు కడుపార తినే పాడిఆవులు
నాయకులు తినేసిన గడ్డిని తలచుకుంటూ 
నెమరు వేస్తుంటాయి 
వాల్ పోష్టర్లు ,ప్లాస్టిక్ కవర్లు కసాపిసా నమిలేసే 
పశు పక్ష్యాదులు మనం సాధించిన అభివృద్ధికి కొలమానాలు.
ఆ పైన మనకోసం అవి గాలిలోంచి, నీటిలోంచి 
ధూళిలోంచి మిగిల్చిన వాటిని 
క్యాన్సర్ కానుకలుగా స్వీకరిస్తూ సంతోషపడాలి.
 
వేడి వేడి పాయా,బిర్యాని,చాట్ 
ప్లాస్టిక్ కవర్లలో కరిగి కరిగి వింత రుచులతో ఆరగిస్తే 
అదో ఆనందం ...
ప్లాస్టిక్ గరగరల శబ్దం 
గుండెను దడ దడలాడిస్తున్నా వేరే ఆలోచనను కూడా 
ఆహ్వానించం ! - ప్లాస్టిక్ బతుకులు కదా మనవి!!!
అసలైన రుచులు అంటే ఏమిటో 
ఇప్పుడు ప్లాస్టిక్ నే అడగాలి.

తెలిసి తెలిసి చేస్తున్న తప్పుకు 
ప్లాస్టిక్ కు  ఏ మాత్రం భాద్యత.
నిజమైన స్పర్శను,భాషను ,అనుబంధాల్ని 
ప్లాస్టిక్ గా మార్చుకున్నదే మనం.

ఇప్పుడు భూమిని ప్లాస్టిక్ తో నింపి 
జీవసారాన్ని జీవంలేకుండా మార్చేస్తున్న 
ప్లాస్టిక్ మనుషులం మనం. 
మనం ప్రేమించే మట్టిని ,పీల్చే గాలిని ,తాగే నీటిని 
స్వచ్చంగా బతికేటట్లు 
ప్లాస్టిక్ రహిత భాషలో సంభాషిద్దాం...

Friday, 15 July 2011

త్యాగమూ నేరమే!

దేహమొక కాంతిపేటిక

ప్రాతః సంధ్యలు సహజ మాతృవాత్సల్యాలతో
వాంచా సామీప్యాలను దూరం చేస్తాయి

ముంగిట తీర్చిన ముగ్గులు
స్వరాలను మెలికలు తిప్పుతూ
నిద్రిస్తుంటాయి

ప్రతి ఘడియా ప్రేమానుభవం కోరుతుంది
లోపల రక్తం సృజనగీతాన్ని రాస్తుంటుంది
నుదుట కుంకుమ
మెడ గంధం
అనుభవాల అర్ధాలను ప్రదర్శిస్తుంటాయి

ప్రేమ-ఒక తనివితీరని ఋణం
రుణగ్రస్తమైనదేదీ మనసును ఒదలదు

ఒక జ్ఞాపకపుతీరాన
తచ్చట్లాడుతూ అతడి ఉత్తరం

ప్రేమ-స్వలాభమే!
త్యాగమూ నేరమే!!

Friday, 8 July 2011

వెలిసిన భ్రమలు

m.f.hussain painting
రంగులు వొలికిపోయాయి
చుట్టూ ఎటుచూసినా రంగులముద్దలు
ఏరుతున్న నాచుట్టూ గడ్డకట్టిన రంగులముద్దలు

అన్ని రంగుల్ని కలిపేసినా ఒకే రంగు
అన్ని భావనల్ని కలిపేసిన ఒకే అనుభూతి
చిట్లుతున్న అనుభూతి పొరలు
పిగులుతున్న దుక్కం
పగిలిన సీసాను నిమిరినప్పుడల్లా
సర్రున కోసేస్తూ గాయాల నృత్యం

అదురుతున్న పెదాలమధ్య
చెదురుతున్న విశ్వాసాల ఊపిరి.
*

                                                                         26 నవంబర్ 1999
                                              ఎంతెంత దూరం 'కవితా సంపుటి నుండి ...

Monday, 4 July 2011

పంజరం

పంజరాన్ని నేనే 
పక్షినీ నేనే
నాకు నేనే ఉచ్చును బిగించుకుంటాను
చిలుకపలుకులే తెలుసు
గొంతెత్తి పాడలేని మూగజీవాన్ని
కవిత్వం రాయాలని సమాజపు పక్షపాతాన్ని నిరసించాలని 
నాలోని కోటానుకోట్ల కణాల యుద్దారావాల్ని 
నాలోని విద్యుత్ ప్రవాహ గీతాన్ని 
నాలోని ఆలోచనా లోచనాల సముద్రాల్ని వెలికితీసి 
నాలోని నన్ను ఆవిష్కరిద్దామనే నా భావన.

కలలున్నాయి ,కాని అన్నీ డొల్లలే-
కథలున్నాయి,కాని ఎవరో పూర్తిచేసిన ముగింపులే-
కనులున్నాయి,కానీ ఎవరో కత్తిరించిన రేటీనాలే
  
సమాజంలో బతకని నువ్వు 
నీ పుట్టుకా  సమాధి పంజరమే అయిన నువ్వు 
పంజరం ఊచలెన్నో లెక్కెట్టుకో !
కవిత్వం కవులే రాయగలరు-
      నీకు అక్షరాలు ఏం తెలుసునన్న పురుషాహంకారం .
అవును! నాకు అక్షరాలు తెలియవు.
వాటి పోడిమాటలూ తెలియవు .

అసలు అక్షరాలేవి?
అయ్యో! వాటికి ప్రాణం ఏదీ?
ఎర్రటి రక్తంలో స్నానాలు చేస్తున్నాయవి !
వెలికి తీద్దామన్న యత్నంలో నా వేళ్ళు తెగి ఆ రక్తంలోనే కలిశాయి. 

చేతులే లేని నేను 
హత్యచేయబడ్డ  అక్షరాలతో నేను 
అసలు బాషే లేని నేను ఎలా మాట్లాడేది? ఎలా రాసేది?
***
నాచేతికి "మాడిఫై "చేయబడిన రూపంలో  గాజులసంకెలలు
నా గొంతులో మూగే జూకాల్లా  శబ్దాలు 
నా బతుకే ధన్యమనే  ''బ్రెయిన్ వాష్'' లు

నా నాలుక తెగ్గోసినా ,చేతుల్ని నరికేసినా 
అక్షరాల్ని విరిచేసినా ,అసలు భాషను దగ్ధం చేసినా 
నేను మరణించ లేదు.
నేను మరణించను
అవును! ఈ నెత్తుటిలో కొత్త పుట్టుక నాది.
ఈ పుట్టుక నా స్వంతం. 
జనన మరణాల పట్టికను నేనే తయారు చేసుకోగలను !
ఎవరికీ నన్ను కాల్చడానికి ,కూల్చడానికి ,ముంచడానికి 
వదిలేయడానికి ,ఉంచుకోవడానికి ,చంపడానికి ,ఎంచుకోవడానికి 
సర్వహక్కులూ ధారాదత్తం చేయబడలేదు.

నేను వైప్లవ్య గీతిని...
మూగతనం తెలిసిన నాకు భాషెంత బాగుంటుందో తెలుసు.
కష్టాలలో మునిగి తేలిన నాకు కడసారి వీడ్కోలు కొత్త కాదు.
కన్నీళ్ళ నదులకి ఆనకట్టలు కట్టి 
కొత్త వంతెనలు కట్టడం తెలుసు!
*** 
నేనొక ప్రాణినేనన్న గుర్తింపుకోసం 
నేనొక సమిధగా కూడా మారతాను.
నన్ను నేనే నిలబెట్టుకోనేక్రమంలో 
నా పాదాలక్రింద ఇసుకల జారిపోతున్న కుబుసాన్ని త్రునీకరిస్తున్నాను .
***     ***
భాషను దూరం చేసిన  ప్రణాళికా కారులకు 
నేనొక కొత్త నిఘంటువును!
బతుకును చౌరాస్తాగా మార్చిన వ్యాహహారికపు ముసుగులకు 
నేనొక కంచు కత్తిని!
నేను తెగినా ,నేలరాలినా ,నెత్తురు చిమ్మినా 
నేనొక మాట్లాడగలిగిన శక్తిని' అని నిరూపించుకుంటాను.
పోరాడటం నాకు కొత్తకాదు.
చాళ్ళనిండా విత్తనాలు మొలకెత్తడం ఇప్పటికే మొదలైంది !!

1999 
 

Sunday, 3 July 2011

కొత్తకోణం

చెట్టుకు అల్లుకుని పాకుతున్న తీగెలా 
ఎండపొడ తగిలి మెరిసే నేలలా
ప్రేమను చుట్టుకుని మెరుస్తున్నాను

అలలు విరిగి ముక్కలై 
సముద్రంలా పరుచుకున్న వాస్తవం ముందు
మట్టిముద్దలా నిల్చున్నాను 
నాలోని చెట్లను,తీగెల్ని,ఎందపోడల్ని,నేలని 
ప్రేమని ధరించే కళ్ళనూ 
దేనికది విడదీసుకుంటూ ,లోపలికి తొంగిచూసుకుంటూ
రూపం ధరించని మట్టిముద్దలానే
           ఇంకా ఇలానే మిగిలి ఉన్నాను 

నాలోపలికి దూసుకొచ్చే యుద్దాలు 
నన్ను బంధించే స్త్రీత్వాలు
నన్ను వర్ణించే 'సహనవతి'' ప్రతీకలు

గంభీరమైన సముద్రం ముందు హోరెత్తుతున్నాను
అలలా విరిగి పడుతున్నాను ,ఎగుస్తున్నాను
చెదరి చెదిరి తుంపర్లుగా మారిపోతున్నాను 
నన్ను చూడని చరిత్రలో
నన్ను కన్నెత్తనీయని కబోధిధర్మాలు
నాకే ముఖమూ లేకుండా చెక్కేసిన చెక్కడాలు 

మళ్ళీ నేను మట్టిముద్ద లోంచి 
మానవి రూపంలోకి  ప్రయానిస్తున్నాను 
వ్యక్తీకరణ  నా కొత్త కోణం ...!

                               "ఎంతెంత దూరం"  కవితా సంపుటి నుంచి ,2005

shilalolitha

 ప్రముఖ కవయిత్రి రేవతీదేవి కవితా సంకలనం పేరు "శిలాలోలిత".
ఆ సంకలనం పేరునే నా పేరుగా ఎంచుకున్నాను.