Friday 30 September 2011

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

భూమిక September 2010
శిలాలోలిత
”కవిత్వం అభిరుచికి సంబంధించిన విశిష్ట కళ. రాయకుండా ఉండలేక పోవడమే కవిత్వానికి మూలసూత్రం. వచన కవిత్వానికి నిర్దిష్ట సూత్రాలంటూ ఏమీ లేవు. అంతరంగ మథనమే వచన కవితకు ఆధారం”- రాజేశ్వరి దివాకర్ల.
ఇవే భావాలతో నిత్య నూతనమైన కవిత్వ రచనలో కొత్త కోణాలను దర్శించాలనే తపన రాజేశ్వరిగారి కవిత్వంలో కనిపిస్తుంది. 2009లో ‘భూమి తడిపిన ఆకాశం’ అనే కవిత్వ సంపుటిని తీసుకొని వచ్చారు.
ఈమె ఉభయ భాషా కవయిత్రి. మూడు దశాబ్దాలుగా బెంగుళూరులోని తెలుగు సాహిత్య రంగంలో సృజనాత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు కన్నడాల గురించి తులనాత్మకమైన వ్యాసాలు రాశారు. ఇంతకు ముందు ‘నీరు స్తంభించిన వేళ, ‘నక్షత్ర దాహం’- కవిత్వ సంపుటులను తీసుకొచ్చారు.ఈ మూడింటి పేర్లతో ప్రకృతి, ఆకాశం,నక్షత్రాలు, నీరు, సమయం, స్తబ్ధత, తృష్ణ, పిపాస, భూమి, ఆర్ద్రత మొదలైనవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ మాలికలో ఈమె రచించిన ‘అక్క మహాదేవి’ ప్రచురితమైంది. అలాగే ‘బసవన్న సమగ్ర వచనాలు’ తెలుగు అనువాదాన్ని అంబికా అనంత్‌తో కలిసి చేశారు. స్త్రీ శరణుల వచనాలు’ అనువాదంలో భాగస్వామ్యం వహించారు. రాజేశ్వరి బసవ సమితి వారి ‘బసవ పథం’ త్రైమాసిక తెలుగు పత్రికకు ప్రధాన సంపాదకులుగా వున్నారు. ‘చైతన్య కవిత’ పత్రికకు చేదోడుగా వున్నారు.బెంగుళూరు ప్రభుత్వ కళాశాలో ఆచార్య పదవిని నిర్వహించి నివృత్తిని పొందారు. మంచి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నారు. స్త్రీ సంవేదన ప్రధానంగా కవిత్వం రాస్తున్న రాజేశ్వరి మార్దవమైన అభివ్యక్తికి వర్తమాన నిదర్శనంగా వున్నారు.
బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో మొదటి మహిళగా పిహెచ్‌.డి.ని పొందారు. రాజేశ్వరి తండ్రిగారు సుప్రసి ద్ధులైన దివాకర్ల వేంకటావధానిగారు అవడంవల్ల అటు ప్రాచీన సాహిత్యంపై పట్టును సాధించగలిగారు. ఆధునికసాహిత్యంపట్ల మమకారాన్ని, అనువాద రచనలపట్ల మక్కువను చూపగలుగు తున్నారు.
రచయిత్రుల మీద రాసిన కవిత ‘నిన్నటివాళ్ళు’ లో ‘రాసుకునేందుకు/ కాగితం కలమైనా లేకున్నా/ గడ్డిపోచనందుకుని/వెలుగుదారిని వెతికారు/గృహస్వేద మాధ్యమంలో/ అక్షరాలను ఒత్తిడి చేశారు/… బాలవితంతువులు/ఆత్మదు:ఖగాయాలను/ శరీరం పిట్టగోడ మీద ఆరేసుకున్నారు./.. మార్పు రావలసిన కాలాలకు/ సాక్ష్యంగా నిలిచారు’.
ఒక సామాజిక బాధ్యతగా రచనను స్వీకరించి స్త్రీల జీవితాల్లోని చీకటి కోణాలను, అసమానతలను వివరిస్తూ రచించడాన్ని సమర్ధించారు. ‘ఆత్మధైర్యం అవతరించాలి/..స్వయంసిద్థ వ్యక్తిత్వం/ నాతోడుగ నిలవాలి/ నేను ఒంటరిని కానని/ నిరూపించాలి/ అనేక పుట్టుకలతో నేను ఒక్కటి కావాలి, స్త్రీలలో ఏర్పడిన చైతన్యం శిశిరపు అంచుల్ని ఒడిసి పట్టుకొని కవిత్వీకరించారు.
పదవీ విరమణ రోజున తన మనస్సులోని మానసిక సంచలనాన్నింటినీ ‘మెట్లు దిగుతూ’.. కవిత్వంలో ఎంతో ఆర్ద్రంగా రచించారు. విదేశాలకు వలస వెళ్ళి పోయిన పిల్లల్ని తలుచుకుంటూ, శరీర మాత్రులు మిగిలున్న వాళ్ళు ‘ఊటలేని చిరునవ్వు’ని కంటి ముందు నిలిపారు. సాలీడు అల్లుకున్న గూట్లో/ తానే చిక్కుపడినట్లు/ అధిక ధరలను చుట్టూ పేర్చుకుని/ గుండెదడను పెంచుకుంటుంది/తరగతుల భావనను వదిలి/మనోగతిని దిద్దుకుంటే/వజ్రా యుధంకాదా/ మధ్యతరగతి మహిళ-జీవన నిర్ణయాన్ని తీసుకునే శక్తి స్త్రీలకుందని నిర్ణయ ప్రకటన చేస్తుంది. తనను తాను తరచి చూసుకున్నప్పుడే, నిజమైన వ్యక్తిత్వం ఏర్పడుతుందని భావించి- ‘నాతో నేను మాట్లాడుకునే/ సందర్భంలో మాత్రం/ నన్ను నేను నిలదీసుకుంటాను, అంటున్నారు? ‘ఆమె - అతడు’ వ్యంగ్య కవిత. కల్పనా చావ్లా మీదా, ఉద్యోగస్థురాలి పిల్లల ఒంటరితనం మీద, తండ్రిని కోల్పోయిన పిల్లల మానసిక స్థితిని, చిత్రిస్తూ కవిత లున్నాయి. చివరికి మిగిలేది? భూమి తడిపిన ఆకాశం, ఒకరినొకరు, రెండు అద్దాలు ఒకే దృశ్యం, పొద్దుటి వెన్నెల, అలిప్త బిందువు వంటి మంచి కవితలున్నాయి. చివరగా రాజేశ్వరి కవిత్యోద్దేశ్యాన్ని తెలిపిన మంచి కవితొకటుంది. ‘విరోధా భాసం’-అది. ‘నాలోపలి దిగులు, భయాలను / ఎదిరిస్తుంటాను/ శిఖరాలను ఎక్కాలని కాదు/ భూమిపై నా కాళ్ళను గట్టిగా నిలపాలని/ నేనంత దూరం నడవలేనని/ జాలి చూపిన వాళ్ళను దూరం నిలిపి/ ముందుకు పోవాలన్న /ధ్యేయంతో తలపడుతుంటాను?.
రాజేశ్వరి కవిత్వం ఒక భావోద్విగ్నతకు గురి చేస్తుంది. ఆమె ‘లో చూపు’, ‘చుట్టు చూపు’ ఆమె పరిణిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మంచి అనువాదకురాలిగా పేర్గాంచిన ఆమె సాహితీ ప్రయాణం ఈ విరామ సమయంలో ద్విగుణీతమవ్వాలని ఆశిస్తున్నాను. సరళమైన భాషతో, చిక్కని భావాలతో, స్పష్టమైన అవగాహనతో రచించిన రాజేశ్వరి సర్వదా అభినందనీయురాలే.

Wednesday 21 September 2011

జాలాది విజయ స్వచ్ఛమైన కవిత్వాక్షరాలు


భూమిక October 2010
శిలాలోలిత
డా.జాలాది విజయ ‘నగ్నాక్షరాలు’ అనే పేరిట కవితా సంపుటిని 2008లో వేశారు. రగులుతున్న దు:ఖంతో వున్న స్త్రీ ముఖ చిత్రంతో పోరాట పటిమను కనబరుస్తున్న దృశ్యాన్ని అక్బర్‌ అద్భుతంగా చిత్రించారు. కృష్ణాజిల్లా పులపర్రులో జన్మించిన ఈమె ప్రస్తుతం, శ్రీ సిద్ధార్థ విద్యా సంస్థలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తన కన్న తండ్రి జానపద మహాకవి ఐన ‘జాలాది’పై ఎం.ఫిల్‌, పి.హెచ్‌డి చేశారు.
ఈ కవిత్వంలో రకరకాల భావాల సమ్మేళనం వుంది. వస్తువైవిధ్యం వుంది. స్త్రీల సమస్యలపై జీవితాలపై రాసిన కవితలలో కత్తికంటె పదునైన భావతీవ్రత వుంది.భావగాఢతా వుంది. ప్రేమ, విరహం నిరీక్షణ వంటి కవితలు ప్రారంభంలో రాసినవై వుంటాయి. వాటిల్లో కొంత సరళత, మామూలు ధోరణే వున్నాయి. కానీ, స్త్రీల మానసిక ఘర్షణను చిత్రించేటప్పుడు మాత్రం కవయిత్రి విజయ ఒక ప్రవాహ వేగంతో రచిస్తూ, పోలికలపై పోలికలు చెబ్తూ పోయారు.
ముందుగా, ‘ఎందుకు’? కవిత గురించి మాట్లాడుకుందాం. మహిళా దినోత్సవాలు జరుపుకోవడం ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఉధృతమైన ఆవేశంతో రాసిన కవిత ఇది. డబ్బున్న స్త్రీలపై, అగ్రకులాలలో వున్న స్త్రీల (కొందరు మాత్రమే, అంటే ఒకళ్ళిద్దరే)పై దాడి సరైంది కాదు. వస్త్రధారణ అనేది వ్యక్తిగతం. స్త్రీలందరం ఒకటనుకోవాలి. స్త్రీలకంటే ముందు మనం మనుష్యులం. మానవత్వం వున్న వ్యక్తులం. మనలో మనకి విభేధాలు సృష్టించాలను కునే వాళ్ళకు మన మాటలే ఆయుధాలౌతాయి. అతి ధోరణిని ప్రదర్శించే ఒకళ్ళిద్దరు స్త్రీల గాటన  అందరి స్త్రీలను కట్టడం ధర్మం కాదు. పుట్టుక మన చేతుల్లో లేదు. పుట్టిన తర్వాత ఎలా జీవిస్తున్నాం. ఎలాంటి భావాలున్నాయి అన్నది ప్రధానం. ఇంత మంచి పరిణితి వున్న కవయిత్రి గళంలో ఇలాంటి నిరసన బాధాకరం అన్పించింది. ‘నేను స్త్రీవాదిని కాను అమ్మవాదిని’ అని ప్రకటించారొక కవితలో. స్త్రీవాదమంటే అదొక  నేరమో, పాపమో, విశృంఖల జీవితమో కాదు. ఆత్మగౌరవ పోరాటం. మన చుట్టూ వున్న కోట్లాది స్త్రీల సమానత్వం కోసం, అస్తిత్వంకోసం, ఆర్థిక దోపిడీని నిరోధించడం కోసం, ఆరాట పడ్తూ పోరాడుతున్నదే స్త్రీవాదం. స్త్రీలలో వున్న బహురూపాల్లో అమ్మరూపం ఒకటి. మాతృత్వ ప్రదర్శన, త్యాగాల కిరీటాలు మోయడమే స్త్రీతత్వం కాదు. మానవత్వాన్ని స్త్రీ పురుషులిరువురూ నింపుకుని, సాటి మనుషులుగా గుర్తించమనే చెబ్తోంది. ఇవన్నీ విజయగారికి తెలియవని కాదు. ఈ దృష్టితో ఆలోచిస్తే, మనమంతా ఒకటనే భావన పెంపొందించుకొంటే ఇంకెన్నో మంచి కవితలు రాయాలని, రాస్తారని నా నమ్మకం. రావూరి భరద్వాజగారి ముందుమాటలో, డా. జయరావుగారి వెనకమాటలో కూడా  ”ఇది స్త్రీవాదం కాదు, అమ్మవాదం’ అంటూ ప్రస్తావించారు. అమ్మవాదం అంటే ఏమిటి? ప్రేమమయమైన స్త్రీ తత్వమనే కదా! స్త్రీవాదం అంటే స్త్రీ చైతన్యమే. స్త్రీల కొరకు పడే తపనే. స్త్రీల సమస్థితి కోసం పోరాటమే. మనని మనం అర్థం చేసుకునే తీరులోనే వుందంతా. పక్కవాళ్ళు రాళ్ళేయడం చూస్తూనే వున్నాం. మన మీద మనమే రాళ్ళేసుకోవద్దనేదే నా భావన.
బతకడానికే రోజుని కోల్పోయిన స్త్రీలు, అలమటిస్త్తూ, ఆరాటపడ్తూ, పోరాడుతున్న స్త్రీలు, తమ విజయాల్ని, తాము సాధించుకున్న హక్కుల్ని తాము పొందుతున్న భావస్వేచ్ఛనూ, నిర్ణయ ప్రకటనల్ని వెలిబుచ్చుకునే రోజుగా, తాము సాధించుకున్న రోజుగా మహిళా దినోత్సవాన్ని ఎందుకు అనుకోకూడదు?
విజయ తన కవిత్వతత్వాన్ని గురించి ఎంతో భావోద్వేగంతో ‘జ్వాలితాక్షరాలు’ అంటూ చెప్పారు.’నడిబొడ్డున పెట్టిన పొలికేక హోరు నా జాతి గుండెలో మండుతున్న అగ్ని కణాల జ్వాల మదిని ముంచుతున్న కన్నీటి ప్రవాహాల సుడిగుండాల ఉప్పెన. క్షణక్షణం వేధిస్తూ నా చుట్టూ ముసురుకున్న జవాబులేని ప్రశ్నలు. మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న మనస్సు మూలుగు నాతోబుట్టువుల రుధిరాక్షర సంతకాలే ఈ ‘నగ్నాక్షరాలు’. నాలో ఉబుకుతున్న.. ఉరుకుతున్న ఎర్రకణాల ఉప్పెనే ఈ ‘నగ్నాక్షరాలు’. ఆక్రోశంతో అలసిన మనసుతో మీ ముందుకు వస్తున్న అలుపెరగని పోరాటం చేస్తున్నా. సరిలేని నెత్తుటి బిందువుని సవరించే చిరు ప్రయత్నం.’ ఆమెకున్న సంస్కారం, తపన, ఆర్తి, వినయం మన కిందులో ప్రస్ఫుటమౌతున్నాయి.
విజయ వాళ్ళ నాన్న మీద రాసిన కవిత ‘రుద్రాక్షరం’. అత్యుత్తమైన జానపద సాహిత్యాన్ని అద్భుతంగా రచించిన ప్రజలకవి ఆయనంటే నాకెంతో గౌరవం కూడా. ‘బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో/ గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో’-లాంటి వాస్తవ సత్యాలెన్నింటినో ఎంతో కరుణార్ద్రంగా వెల్లడించారు.
ఆశ, ఆఖరి ప్రయాణం, నీలాగే , రాజీనామా, నమ్మకం మోసపోయింది, శూన్యమైన మనస్సు మీద, మృత్యుతరంగాలు, కలల మేడలు, అంతిమ విజయం ఎవరిది? ఎదురు చూపు, అమృతవర్షం, నా అక్షరాల సాక్షిగా వంటి మంచి కవితలెన్నో ఇందులో వున్నాయి. ‘మరో ప్రపంచంకోసం’ కలలు కంటూ ఆశావహ దృక్పథంతో ఈ కవయిత్రి ఎదురు చూస్తోందిలా.
‘ఇంకిన బిందువులా/ ఇంకుతున్న బంధువులా/ జంకులేని నెత్తురు బిందువులా/ మరో ప్రపంచంకోసం/ ఎదురుచూస్తున్నా!

Wednesday 7 September 2011

కవిత్వ కలనేత - సుహాసిని

భూమిక December 2009
 శిలాలోలిత
 ’నేను జీవితంలో ఓడిపోయిన ప్రతీసారి నన్ను ఓదార్చింది, గెలిచిన ప్రతీసారి నా భుజం తట్టింది ఈ అక్షరాలే’ - అని డా|| లక్ష్మీసుహాసిని తన అంతరంగ చిత్రాన్ని మన ముందు ఉంచారు . గతంలో ‘దామదచ్చియ’లో అనే పాటల సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు . సుహాసిని తల్లి ‘దర్భా భాస్కరమ్మ’ సాహిత్యరంగంలో గణనీయమైన కృషిచేయడం వల్ల, కేవలం సుహాసినికి  లోకానికి పరిచయం చేయడమేకాక, కవితాక్షరాలను కూడా యిచ్చిన ఖ్యాతి భాస్కరమ్మ గారిది.
 అందుకే సుహాసిని జీవితంలో సాహిత్యం కలగలిసి పోయింది. స్త్రీలపై ఎంతో ఆర్ద్రతతో ఆవేదనతో రాసిన కవితలనేకం. స్త్రీలలో ఆత్మగౌరవాన్ని, దృఢత్వాన్ని కోరుకుందామె.
 ’ఆడవారిమీద సాగే ప్రతీ అణచివేతా అత్యాచారాల మీద
 అక్షరయుద్ధం సాగిస్తాను’ - అంది. (ఆసూంకి కసమ్‌)
 ’మా మెడలు వంచి మూడుముళ్ళు వేశారు నిన్న ఆ మెడలు కోసి ప్రేమించవేం? అంటున్నారివాళ.’ - (రివాజు)
 ఇప్పుడు చెలరేగుతున్న ప్రేమోన్మాదుల ఘాతుకాలన్నింటినీ ఈ అక్షరాలలో పొదిగిన్దీమే .
 ’అందరికీ నువ్‌ తలలో నాలుక
 నీ నాలుక తడారిపోడం మాత్రం ఎవరికీ పట్టదు
 అందరి నవ్వులకూ ఆలంబన నువ్వు
 కానీ ఎవరికీ పట్టదు కరవైన నీ నవ్వు’ (ఓ గృహిణి మాత్రమే)
 ఇలా ఎంతకాలం నుంచో మగ్గిపోతున్న స్త్రీల జీవితాలను ఆవిష్కరిస్తూ - ఇంకో కవితలో..
 ’ఉద్వేగాలను అదుపు చేసుకునే
 చైతన్యాన్ని కోల్పోతున్న మీ పురుషాహంకారం మీదనే
 మా నిరసన
 మాతో చెయ్యి కలిపి పోరాడాల్సిన మీరు
 మీ జాత్యహంకారం విడిచి మా నినాదాన్ని వినండి
 మేం ముక్త కంఠంతో గర్హిస్తున్నాం
 ’ఇంకానా ఇకపై సాగదని’ -
 చాలా స్పష్టమైన అవగాహన వున్న కవయిత్రి అవడంవల్ల పురుషులమీద కాదు విమర్శ - పురుషాహంకారం పట్లనే మా నిరసన అంటుంది.
 మానవస్వభావాల్లో మార్పు రావాలని, స్త్రీపురుషలిరువురూ సమానులనీ, స్త్రీలపై హింస ఇంకా కొనసాగకూడదనీ - ఆశావహ దృక్కోణాన్ని కవిత్వీకరించింది.
 లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూండడంవల్ల విద్యార్థులతో సన్నిహితంగా మెసిలే వీలున్నందువల్ల విద్యావిధానంపై కొన్ని కవితలున్నాయి. పాఠ్యాంశాలలోని లోటుపాట్లనీ, అవి చెప్పాల్సి రావడం పట్ల నిరసననీ, విద్యార్థుల మనోవికాసాలకు పనికిరాని పాఠాల్ని కూడా, ఎంతో కష్టపడి మార్చి చెప్పాల్సివస్తున్న స్థితినీ, వాటిని కూడా విద్యార్థులలో విలువల్ని పెంచే దిశగా బోధిస్తున్న విధానాన్ని కవిత్వంలో చెప్పారు .
 ’చెలకుర్తి’ సంఘటనపై స్త్రీలపై హింస పరాకాష్టను చేరుకున్న దృశ్యాన్నీ, కోల్పోతున్న బాల్యాల్నీ, విప్లవమే, ఆ మార్గమే సమస్థితిని తీసుకొస్తుందన్న నమ్మకాన్నీ, ద్రోణాచార్యుడు నరికిన బొటనవేలు గురించి కాదు - ‘చిటికినవేలు కుట్ర’ సంగతేమిటి? ఆ రోజునుంచీ స్త్రీల స్వేచ్ఛ, సంతోషం ఆఖరంటుంది. పసిపిల్లల దైన్యస్థితినీ, పసిపిల్లల బండెడు పుస్తకాల్నీ, రైతుల కడగండ్లు కురిసే వడగండ్లనూ, ఇలా వివిధ సామాజికాంశాలన్నింటినీ కవిత్వంగా  మలిచింది.
 ’రెక్కలు పొదిగిన చూపు’ - పేరు కవిత్వ సంకలనానికి పెట్టడంలోనే, ఒకరికన్ను మరొకరికి ఎలా వెలుగవుతుందో, చెప్తూనే, చూపు సాధించుకున్న స్వేచ్ఛనూ, మరణరాహిత్యాన్ని చెప్పింది. భావస్వేచ్ఛ సాధించినప్పుడు, స్త్రీలు సంఘటితమై బలోపేత మైనప్పుడూ, పురుషుల స్వభావాల్లో పరిపూర్ణమైన మార్పు వచ్చినప్పుడూ, మనం కలలు కనే భావిజీవితం మనముందే ఉందని చెప్పిన ఆశావాది సుహాసిని.