Showing posts with label ఎంతెంత దూరం. Show all posts
Showing posts with label ఎంతెంత దూరం. Show all posts

Tuesday, 16 August 2011

కొత్త ఇళ్ళు కట్టుకుందాం

ఆమె ఒక మతం
అతడు ఒక మతం
కాలాతీత మతాతీతం అభిమతం
మధ్యన ద్వీపంలా సంతానం

మోహావరనంలా తప్పిపోయిన  శరీరం
జీవితంలోంచి తొంగిచూస్తుంది
జనాభాలెక్కల్లో తేలని మతాలమధ్యన
ఒక మతంగా జన్మెత్తాడు ఓ శరీరాన్ని పంచుకుని -

ఈ చిన్నారి ప్రశ్నలకు
హిందూ,ముస్లిం,సిక్కు గడుల 'సెన్సెస్ చార్టు'
జవాబులకోసం వెతుక్కుంటుంది
దొరకని జవాబులకోసం
చిన్నారి జీవితాంతం అన్వేషించాలా?
ముఖం చెక్కేసిన'బహామియన్' బుద్దుడిలా
మతముఖంలేని నా రక్తంలో రక్తం.....

ప్రేమికులారా!
మోహంలోనూ  మతాన్ని చూడండని ఇక ఉద్యమాలు లేవదీద్దాం
మతాల్నే ప్రేమించమని దేహాలతో మొరపెట్టుకుందాం
ముఖం వెనుక దాగిన చూపులకు
మతకచ్చడాలు బిగించమని మతపెద్దల్ని అడుగుదాం

దేహంకూడా ఒక మతమేనని చాటుదాం

మృత్యువులోంచి కూడా కళ్ళు తిప్పుతూ
ప్రశ్నించడం మానని మతం !

దంపతులారా!
మన ప్రేమలకు ఈ ఇళ్ళు చోటివ్వలేవు
మన ఇళ్ళు మనమే నిర్మించుకుందాం.

@.@
                                                                                     

Friday, 5 August 2011

గోరటెంకడి పాట

వాగ్గేయకారులెలా ఉంటారు !?
చింతాకంతే వుంటారు 
చిరస్మరనీయులై నిలుస్తారు 

ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య
ఒక త్యాగయ్య, ఒక మీరా 
ఇదిగో ఇక్కడ 
తెలంగాణా భూమిని తొలుచుకుని గోరటి వెంకన్న!

అతడి నోటినిండా పల్లెపదాలు
పాట ఎత్తుకుంటే పల్లె మన ముంగిట నిలుస్తుంది 
పదబంధాలు,ప్రతీకలు బంతిపూలై నవ్వుతాయి.
కళ్ళు ఎగిసిన అలలై మెరుస్తాయి 
ఊరుతల్లి ఇంటిముంగిట ముగ్గవుతుంది 
చెట్టూ చేమా , కాయాకసరూ 
ఉప్పూనిప్పూ కరువూ కష్టం
చేలెంబడి ,డొంకలెంబడి తిరుక్కుంటూ పాటల్లా నడుస్తాయి 

ఊరోళ్ల ఊసులు సంతలకధలు వెతలు రాములయ్య బతుకుభాగోతాలు హరిశ్చంద్రుడి కాటికాపరి దుక్కం 
కన్నీరొక చుక్కుండిన చాలునన్న వేదాంతాలు ఆలుమగల్ల రాద్దంతాలు సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మలు 
డెంకదేడ్డెం 'అంటూ లేగాదూడలైన పిల్లకాయలు కనిపించని కుట్రల్లో పల్లెకన్నీరు పెడుతుందని దృశ్యమానం 
చేసే పాటల మాటల ఊటల ఆవేదనార్తుల కలబోతల ఒక అనంత ప్రవాహం ఆతడి పాట.చదువుకున్నోళ్ళ
ఉన్నోళ్ళ ,ఉన్నున్నోళ్ళ నోటెంట పలికే గిలికే రాతలే నిజమంటున్న కాలంలో -బతుకుబండిలో పల్లెనేక్కించిన
జానపద సాహిత్య రారాజు అతడు.

అతడొక ఉద్యమం ,అతడొక ప్రవాహం ,పరీవాహకం
అతడి గుండె ఒలికిన పాట పోటెత్తిన అల
'వేమన'లా ప్రతీకలని చుట్టూ చూస్తూనే 
ఒడిసిపట్టుకుని విత్తనాల్లా వెదజల్లుతాడు 
చరణాల నాగటిచాల్లలో ఏం పోలిక రువ్వుతాడో తెలీదు
ఎవరి గుండె పిగులుతుందో తెలీదు 
అతడినోట ప్రతి పాట ఓ బతుకుగుండం ,జీవన్మరణ పోరాటం
అంతర్గత సంక్షుభిత విలయనృత్యం

తెలంగాణ కన్నమట్టిబిడ్డ,మరో బిడ్డ 
కన్నతల్లి కనుకొలకులలో మెరుపై నిలిచే నెత్తుటి గుండం!

Saturday, 30 July 2011

చూపులు

కన్ను తడిగుండెల మడతల్ని
విప్పుతూ వుంటుంది 
ఆ రెప్పలకు 
బతుకుమూత మూయడమూ తెలుసు 

కన్రెప్పల దారాలతో 
ఒక్కొక్క గాయాన్ని కుట్టుకోవడమూ తెలుసు 
అంతరంగ యుద్దాల్లో 
నెత్తురోడిన జీరల్ని దాచుకోవడమూ తెలుసు 

నల్లటి అశాంతుల ఆవర్తనాల్ని 
శ్వేత బిందువులతో సమర్ధించడమూ తెలుసు 
1
చంక్రమనాలు చేసే బతుక్కి
చూపై, స్థిరమై, నిలిచే అభివ్యక్తి .
ఎదురు చూపుల్లోంచి ,బతుకు చూపుల్లోంచి 
బతుకంతా ఎదురుచూడ్డం అంటే 
ఒక జీవిత సాఫల్యం చేకూరినట్లు -

అలజడుల ఊపిరుల నడుమ 
కాలాన్ని కొలవడం ఒక యుద్దమే!
అశాంతి మాత్రమే చూపుల్లోంచి కరుగుతుంది ,
కాలాన్ని కదుపుతుంది 
ఎడారుల నిశ్శబ్దం 
ఎండుటాకుల పైనుంచి లేచిన చిరుశబ్దం
ఊపిరినుంచి ఎగిసిన నిట్టూర్పు-
                            అన్నీ చూపులే! 
అన్నట్టు, లోచూపు ఇప్పుడే వెలిగింది.
అన్నీ -చిత్రాలే ఇక !!!


+ + +