Monday, 12 March 2012

పేమ రాహిత్యంలో నాలుగు ముఖాల సంచలనం

Posted By on July 9, 2009
శిలాలోలిత
మాధవి కుట్టి ఒక సీతాకోకచిలుక, కమల ఒక మంచుకొండ, కమలాదాస్‌ ఒక లావా ప్రవాహం. కమలా సురయ్యా ఒక అగ్నికణం. బతుకంతా అన్వేషణలోనే అలసి సొలసిన బాధాగ్ని రేణువు
అమ్మా-నాన్నలు, మేనమామల సాహిత్య సృజనను చిన్నప్పటినుంచీ దగ్గరగా చూస్తుండటంతో, సాహిత్యప్రేమ మొదలైంది. ఆమె తొమ్మిదవ ఏట పిల్లల కథను రాశారు. కవిత్వమంటే పిచ్చి ప్రేమ ఉండేది. కానీ ఫక్తు వ్యాపారవేత్త భర్త దృష్టిలో, కవిత్వం రాయడం వల్ల ఎక్కువడబ్బులు రావు. మార్కెట్‌ లేదు. సెన్సేషన్‌ వున్న రచనలు కథ, నవల, వ్యాసం ఆత్మకథల్లాంటివైతే డబ్బులు రాల్తాయనేది అతని వాదన. కమలలో రెండు యుద్ధభూములున్నాయి. రోజూ కత్తులు దూసుకోవడమే. భర్తకున్న ధనకాంక్ష, ఆజ్ఞాపించే ధోరణికి అలవాటు పడిపోయినా, ఏసెన్సారింగు తనకు తాను విధించుకోని తత్వం ఆమెలో వున్నందువల్ల చాలా స్వేచ్ఛగా రాసింది.
15 సం||లకే పెళ్ళయి, 16 ఏళ్ళకే తల్లయినందున బాధ్యతలు, కుటుంబంలో కూరుకుపోయింది. మానసికంగా సంసిద్ధత దశకు చేరుకోని దశలోనే భర్త లైంగిక ప్రవృత్తి, మొరటుదనం ఆమె శరీరాన్నే కాక మనసునూ గాయాలపాలు చేసింది. ‘స్టాక్‌ వెరిఫికేషన్‌’ కవితలో భర్త మరణాన్ని అత్యంత దగ్గరగా చూసిన తీవ్రతను రాస్తూనే ‘కాళ్ళ మధ్య ఓ మనిషిని బిగబట్టి ముగ్గురు కొడుకుల్ని బయటికి తెచ్చాను” అని వేదాంతిలా అంటారు.
”పిల్లల్తో పాటూ నేనూ పెరిగాను, ఆడుకున్నాను. నా భర్తకూ నాకు సంవత్స రాల దూరం చాలా ఉన్నందున పిల్లల్లా నేనూ పేచీలు పెట్టాను’ అంటుందొకచోట. మనిషి బతికున్నాడన డానికి నిదర్శనం కోల్పోని చిరునవ్వు, పసితనమే. ఈ రెండూ ఆమెలో చివరి వరకూ ఉన్నాయి. అందుకే ఆమె రచనల్లో ఆ సహజత్వం, నిర్మలత్వం, ధైర్యం, వాదనాపఠిమ నిరంతరం కొనసాగుతూనే వున్నాయి.
కమలాదాస్‌ ‘మై స్టోరీ’ ఆత్మకథ సాహిత్యరంగంలో తీసుకొచ్చిన సంచలనం మనకు తెలిసిందే. దేశభాషను, ప్రకంపనాలను, విస్ఫోటనాలను ఎంతో నిజాయితీగా భావోద్వేగంగా రచించిన ఆనందాన్వేషి. పిడికెడు ఆనందం కోసం, గుప్పెడు ప్రశాంతత కోసం, చారెడు రసానుభూతికోసం, బారెడు ప్రేమకోసం, పరిశ్రమించిన అన్వేషించిన నిరంతర చలనశీలి ఆమె. కానీ బతుకంతా అన్వేషణే మిగిలింది. ప్రేమగా చూసే వ్యక్తులు తారస పడలేదు. దేహవాంఛే ప్రధానమనుకుంటు న్నారే కానీ, మనస్సూ దేహము ఏకకాలము లో భావోద్వేగ కెరటాన్ని ఒరుసుకుంటూ ప్రవహించే, రాగరంజితం చేసే స్థితికోసం ‘మృగన’ గానే మిగిలిపోయింది. తనలోని మనసుతో, తనకున్న దేహంతో, తనదైన జీవితంలో, తన మేధస్సుతో పెనుగులాడే ఆమె రచనలు. తను అనుకున్న దానిని ఎంతో ధైర్యంగా ప్రకటించే తత్వమామెది. మనం జాగ్రత్తగా గమనిస్తే, సెన్సేషన్‌ కోసం ఆమె రాయలేదు. కానీ, ఆమె రాసినందా సెన్సేషన్‌ అయింది.
కమలాదాస్‌ కవిత్వానికి ఓ మచ్చుతునక మాత్రమే ఈ కవిత. చర్చించడం మొదలుపెడితే ఆ చర్చ అనంతంగా సాగిపోతుంది.
”పురుగులు” – కమలాదాస్‌
నదీతీరంలో, సూర్యాస్తమయవేళ
ఆమెతో కృష్ణుని చివరి సంగమం…
ఆరాత్రి భర్త కౌగిలిలో రాధ నిర్జీవంగా…
”ఏమయింది”…?
”చెలీ నా ముద్దులు నీకు రుచించడం లేదా?”
”అబ్బే అదేం లేదు?” ఆమె జవాబు
కానీ, ”పురుగులు కొరికితే శవానికి నొప్పి తెలుస్తుందా”?
ఆమెలో సుళ్ళు తిరుగుతుందో ప్రశ్న….
(- అనువాదం : పసుపులేటి గీత)
ఆమె ఎన్నో అవార్డులను గెలుచు కుంది. జాతీయ అంతర్జాతీయ పురస్కారాల నేకం పొందారు. అనేక భాషల్లోకి రచనలు అనువాదమయ్యాయి.
కేరళలోని మలబారు తీరంలో త్రిసూర్‌ జిల్లాలో వున్న యురుక్కుళంలో 31.03.1932లో జన్మించింది. 31.05.2009లో ఆదివారం నాడు పూణే లోని జహంగీర్‌ ఆస్పత్రిలో, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడ్తున్న ఆమె తుదిశ్వాసను విడిచారు. 75 ఏళ్ళపాటు జీవించిన ఆమె అంతరంగ చిత్రాలే రచన రూపాన్ని తొడుక్కొని, అక్షరాలుగా మనముందు నిలిచాయి.
‘వంశస్థులు’ కవితలో ఆమె మాటలు – ”నేను మరణించినప్పుడు నా మాంసాన్ని ఎముకల్ని విసిరిపారేయకండి. వాటిని ప్రోదిచేయండి. వాటి వాసనతో వాటిని చెప్పనివ్వండి. ఈ భూమ్మీద జీవితపు విలువేమిటో, అంతిమంగా ప్రేమ విలువేమిటో వాటినే చెప్పనివ్వండి”.

Tuesday, 7 February 2012

సాహితీ సముద్రతీరాన – చిల్లర భవానీదేవి కవిత్వం

సాహితీ సముద్రతీరాన – చిల్లర భవానీదేవి కవిత్వం

Posted By on April 4, 2010
శిలాలోలిత
డా. చిల్లర భవానీ దేవి గత పాతికేళ్ళకుపైగా కవిత్వం రాస్తున్నారు. నిరంతర ప్రవాహగుణం ఆమె కవిత్వ లక్షణం. తొలికవితా సంపుటి 1986లో నాలోని నాదాలు. 93లో గవేషణ, 96లో శబ్దస్పర్శ, 2001లో వర్ణనిశి, 2004లో భవానీ నానీలు, 2006లో అక్షరం నా అస్తిత్వం, 2007లో హైదరాబాద్‌ నానీలు మొదలైన కవిత్వ సంపుటులను ప్రచురించారు.
అలాగే రెండు కధా సంపుటాలు, అంతరంగ చిత్రాలు 96లో, అమ్మా!నన్ను క్షమించొద్దు…2008లో తీసుకొని వచ్చారు. ‘అధ్యయనం’2007లో, కవయిత్రుల నానీ’2007లో వ్యాస సంపుటాలుగా ప్రచురించారు. కవయిత్రిగా, రచయిత్రిగా, విమర్శకురాలిగా, వక్తగా తనకంటూ ఒక చిరపరిచిత స్థానాన్ని సాహితీలోకంలో ఏర్పరుచుకున్నారు. పుస్తక ప్రచురణల విషయంలో ఆమె కొంత మందికి స్ఫూర్తి కూడా.
రచనను ఒకకాలక్షేపంగానో, అలవాటుగానో, కీర్తికోసమో కాకుండా, ఒక కమిట్‌మెంట్‌ వున్న రచయిత్రిగా భవానీదేవి జిజీ చెప్పుకోవచ్చు. ఆమె రచనలే ఆవిషయాన్ని వెల్లడిస్తాయి. 2009లో వచ్చిన కొత్త కవిత్వ సంపుటి ‘కెరటం నా కిరీటం’ కవయిత్రి మాటల్లోనే వినాలంటే – ‘నా కవిత్వం బహిర్‌ అంతశ్చేతనల సమ్మిళితం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే నా సంవేదన. పుట్టింది సముద్ర తీరం. అదే నా జీవితానికీ కవిత్వానికీ బ్యాక్‌డ్రాప్‌. సముద్రంలో ఉన్నవన్నీ నాలోనూ వున్నాయి. మనుషుల్ని ప్రేమించడం నేర్పినందుకు సముద్రానికి నా కృతజ్ఞతలు.  ప్రపంచం పాడవటానికి బయటి కాలుష్యం కంటే భావకాలుష్యమూ ఒక కారణం. నిజానికి బయటి కాలుష్యానికి ప్రతిబింబం. అలాగే కవిత్వం కూడా అన్ని రకాల కాలుష్యాలను క్షాళితం చేయాలని నా అభిప్రాయం’- అంటూ వెల్లడించారు. ఈ పుస్తకాన్ని తన ఆత్మీయ మిత్రురాలైన ‘పూడిగిరిజ’కు అంకితమిచ్చారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈ కవయిత్రి సచివాలయంలో ఉన్నత పదవిలో వున్నారు. ఉద్యోగ బరువు బాధ్యతల్లో తనను వెన్నంటి వున్న వెన్నెల కవిత్వమని ఆమె భావన. మానవత్వం తన కవిత్వతత్వమంటున్నారు.
‘ఉరకలెత్తె నదిని నేను/కన్నీటి పడవనూ నేనే/నడిపే సరంగునూ నేనే/నా వైపు పరిగెత్తుకొచ్చే తీరాన్నీ నేనే/అందుకే కెరటం నా కిరీటం’ – స్త్రీ జీవన స్థితినీ, ఆకాంక్షల్నీ, బతుకు తత్వాన్ని అంతస్సూత్రాన్నీ కవిత్వీకరించారు. గత స్మృతుల్నీ తలచుకుంటూ-ఇన్నాళ్ళకు/సగం రాసి వదిలేసిన/బతుకు పుస్తకం దొరికిందివ్వాళ/ఇన్నేళ్ళకు/మనసు గుర్తుల్ని మరోసారి వెదుక్కుంటున్నాం’ ( ఈ క్షణంలో!) ‘రెండు కొండల దోసిట్లోంచి/ జగత్కల్యాణం సంకల్పంగా జారే గోదారి/ ఈ నీటి కుంచెల వర్ణ చిత్రాల్లో/ నా అక్షరాత్మల ఆకృతుల్ని వెదుక్కుంటున్నాను (పాపికొండలపాట)
సముద్ర గర్భంలో ఆల్చిప్పల శరీరం మధ్యలో మెరిసే ముత్యాల్లా, వెతికిన కొద్దీ దొరికే ముత్యాలు భవానీదేవి కవిత్వాలు. ముత్యం ఓ వర్షపు చినుకు. సరైన సమయంలో ఆల్చిప్ప మనసును గెలుచుకున్నప్పుడు, స్థిరీకృతరూపాన్ని సాధించుకోవడానికి చేసే  నిత్య యత్నంలో ఘన రూపాన్ని ఆపాదించుకుంటుంది. అలాగే, సముద్రతీరాన మనిషిగా పుట్టినా, మాటల మూటల్ని కవిత్వాలుగా మలిచే శక్తిని సముద్రం దగ్గరే నేర్చుకున్నారన్పించింది. కవిత్వాన్ని కవిత్వంగా ప్రేమించే సహృదయ పాఠకులందరూ మెచ్చే పుస్తకమిది. రాతిలో చెమ్మ, అద్దం – అనేక బింబాలు, రెండో ముఖం, ఈ రాత్రి, ఒక ఏకాంతం కోసం, కలలబేహారి, నాతోనే, లోపలినది, ఈ యుద్ధం ముగిసిందా? చిన్నప్పటిఫోటో, ప్రయత్నం హైఎలర్ట్‌, హెచ్చరిక, ఘనీభవనం ఇలా చదివించేగుణం ఆర్తి వున్న కవితలనేకం వున్నాయి.
స్త్రీ పురుషుల నిండైన జీవితం కోసం, సమ స్థితి కోసం ఎన్నో కవితల్లో రకరకాలుగా వ్యక్తీకరిస్తూనే వున్నారు. భ్రమకీ వాస్తవానికీ మధ్య/విభజన రేఖని స్పర్శించేది మనసే/ప్రేమించడం నా బలమైన బలహీనత /దాన్ని ఆవిరి చేయటం నీ నిర్వీర్యత/ఇప్పుడైనా/మన ఆభిజాత్యపు పొరల్నివొల్చుకుంటూ/ ఒకరిలోకి ఒకరుగా ప్రవహిస్తూ/ చీకటి ముసిరినప్పుడు మెరిసే  నక్షత్రాల్లా/కాసేపు చీకట్లోనే మాట్లాడుకుందాం/ హృదయనేత్రాల్ని విప్పార్చిచూసుకుందాం! (ప్రయత్నం)
చాలా మెత్తటి గొంతు ఈ కవయిత్రిది. నిరాడంబరమైన మాటల్లో, సున్నితమైన వ్యక్తీకరణతో, నచ్చజెప్పే ధోరణిలో కవిత్వముంటుంది. స్పష్టమైన అభిప్రాయాలతో, సామాజిక స్థితిగతుల పట్ల సరైన అవగాహన , అనుభవం వున్న కయిత్రి, ఈ చీకటి సమాజంలో వెన్నెల రావడంకోసం, తేవడం కోసం చేసిన యత్నమే ఈ కవిత్వం,  సముద్రం ఉప్పొంగిన గుండెతో పరవశించాలంటే వెన్నెలరేఖలే కావాలి. సమాజం ఉన్నత చైతన్యంతో వెలుగొందాలంటే, వెన్నెలలాంటి స్వచ్ఛమైన మానవ హృదయాలే కావాలన్న కవియత్రి భావగాఢతను ప్రశంసిస్తూ నిరంతరం ఇలానే కవిత్వాన్ని రాయాలని అభిలషిస్తున్నాను.