Tuesday 7 February 2012

సాహితీ సముద్రతీరాన – చిల్లర భవానీదేవి కవిత్వం

సాహితీ సముద్రతీరాన – చిల్లర భవానీదేవి కవిత్వం

Posted By on April 4, 2010
శిలాలోలిత
డా. చిల్లర భవానీ దేవి గత పాతికేళ్ళకుపైగా కవిత్వం రాస్తున్నారు. నిరంతర ప్రవాహగుణం ఆమె కవిత్వ లక్షణం. తొలికవితా సంపుటి 1986లో నాలోని నాదాలు. 93లో గవేషణ, 96లో శబ్దస్పర్శ, 2001లో వర్ణనిశి, 2004లో భవానీ నానీలు, 2006లో అక్షరం నా అస్తిత్వం, 2007లో హైదరాబాద్‌ నానీలు మొదలైన కవిత్వ సంపుటులను ప్రచురించారు.
అలాగే రెండు కధా సంపుటాలు, అంతరంగ చిత్రాలు 96లో, అమ్మా!నన్ను క్షమించొద్దు…2008లో తీసుకొని వచ్చారు. ‘అధ్యయనం’2007లో, కవయిత్రుల నానీ’2007లో వ్యాస సంపుటాలుగా ప్రచురించారు. కవయిత్రిగా, రచయిత్రిగా, విమర్శకురాలిగా, వక్తగా తనకంటూ ఒక చిరపరిచిత స్థానాన్ని సాహితీలోకంలో ఏర్పరుచుకున్నారు. పుస్తక ప్రచురణల విషయంలో ఆమె కొంత మందికి స్ఫూర్తి కూడా.
రచనను ఒకకాలక్షేపంగానో, అలవాటుగానో, కీర్తికోసమో కాకుండా, ఒక కమిట్‌మెంట్‌ వున్న రచయిత్రిగా భవానీదేవి జిజీ చెప్పుకోవచ్చు. ఆమె రచనలే ఆవిషయాన్ని వెల్లడిస్తాయి. 2009లో వచ్చిన కొత్త కవిత్వ సంపుటి ‘కెరటం నా కిరీటం’ కవయిత్రి మాటల్లోనే వినాలంటే – ‘నా కవిత్వం బహిర్‌ అంతశ్చేతనల సమ్మిళితం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే నా సంవేదన. పుట్టింది సముద్ర తీరం. అదే నా జీవితానికీ కవిత్వానికీ బ్యాక్‌డ్రాప్‌. సముద్రంలో ఉన్నవన్నీ నాలోనూ వున్నాయి. మనుషుల్ని ప్రేమించడం నేర్పినందుకు సముద్రానికి నా కృతజ్ఞతలు.  ప్రపంచం పాడవటానికి బయటి కాలుష్యం కంటే భావకాలుష్యమూ ఒక కారణం. నిజానికి బయటి కాలుష్యానికి ప్రతిబింబం. అలాగే కవిత్వం కూడా అన్ని రకాల కాలుష్యాలను క్షాళితం చేయాలని నా అభిప్రాయం’- అంటూ వెల్లడించారు. ఈ పుస్తకాన్ని తన ఆత్మీయ మిత్రురాలైన ‘పూడిగిరిజ’కు అంకితమిచ్చారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈ కవయిత్రి సచివాలయంలో ఉన్నత పదవిలో వున్నారు. ఉద్యోగ బరువు బాధ్యతల్లో తనను వెన్నంటి వున్న వెన్నెల కవిత్వమని ఆమె భావన. మానవత్వం తన కవిత్వతత్వమంటున్నారు.
‘ఉరకలెత్తె నదిని నేను/కన్నీటి పడవనూ నేనే/నడిపే సరంగునూ నేనే/నా వైపు పరిగెత్తుకొచ్చే తీరాన్నీ నేనే/అందుకే కెరటం నా కిరీటం’ – స్త్రీ జీవన స్థితినీ, ఆకాంక్షల్నీ, బతుకు తత్వాన్ని అంతస్సూత్రాన్నీ కవిత్వీకరించారు. గత స్మృతుల్నీ తలచుకుంటూ-ఇన్నాళ్ళకు/సగం రాసి వదిలేసిన/బతుకు పుస్తకం దొరికిందివ్వాళ/ఇన్నేళ్ళకు/మనసు గుర్తుల్ని మరోసారి వెదుక్కుంటున్నాం’ ( ఈ క్షణంలో!) ‘రెండు కొండల దోసిట్లోంచి/ జగత్కల్యాణం సంకల్పంగా జారే గోదారి/ ఈ నీటి కుంచెల వర్ణ చిత్రాల్లో/ నా అక్షరాత్మల ఆకృతుల్ని వెదుక్కుంటున్నాను (పాపికొండలపాట)
సముద్ర గర్భంలో ఆల్చిప్పల శరీరం మధ్యలో మెరిసే ముత్యాల్లా, వెతికిన కొద్దీ దొరికే ముత్యాలు భవానీదేవి కవిత్వాలు. ముత్యం ఓ వర్షపు చినుకు. సరైన సమయంలో ఆల్చిప్ప మనసును గెలుచుకున్నప్పుడు, స్థిరీకృతరూపాన్ని సాధించుకోవడానికి చేసే  నిత్య యత్నంలో ఘన రూపాన్ని ఆపాదించుకుంటుంది. అలాగే, సముద్రతీరాన మనిషిగా పుట్టినా, మాటల మూటల్ని కవిత్వాలుగా మలిచే శక్తిని సముద్రం దగ్గరే నేర్చుకున్నారన్పించింది. కవిత్వాన్ని కవిత్వంగా ప్రేమించే సహృదయ పాఠకులందరూ మెచ్చే పుస్తకమిది. రాతిలో చెమ్మ, అద్దం – అనేక బింబాలు, రెండో ముఖం, ఈ రాత్రి, ఒక ఏకాంతం కోసం, కలలబేహారి, నాతోనే, లోపలినది, ఈ యుద్ధం ముగిసిందా? చిన్నప్పటిఫోటో, ప్రయత్నం హైఎలర్ట్‌, హెచ్చరిక, ఘనీభవనం ఇలా చదివించేగుణం ఆర్తి వున్న కవితలనేకం వున్నాయి.
స్త్రీ పురుషుల నిండైన జీవితం కోసం, సమ స్థితి కోసం ఎన్నో కవితల్లో రకరకాలుగా వ్యక్తీకరిస్తూనే వున్నారు. భ్రమకీ వాస్తవానికీ మధ్య/విభజన రేఖని స్పర్శించేది మనసే/ప్రేమించడం నా బలమైన బలహీనత /దాన్ని ఆవిరి చేయటం నీ నిర్వీర్యత/ఇప్పుడైనా/మన ఆభిజాత్యపు పొరల్నివొల్చుకుంటూ/ ఒకరిలోకి ఒకరుగా ప్రవహిస్తూ/ చీకటి ముసిరినప్పుడు మెరిసే  నక్షత్రాల్లా/కాసేపు చీకట్లోనే మాట్లాడుకుందాం/ హృదయనేత్రాల్ని విప్పార్చిచూసుకుందాం! (ప్రయత్నం)
చాలా మెత్తటి గొంతు ఈ కవయిత్రిది. నిరాడంబరమైన మాటల్లో, సున్నితమైన వ్యక్తీకరణతో, నచ్చజెప్పే ధోరణిలో కవిత్వముంటుంది. స్పష్టమైన అభిప్రాయాలతో, సామాజిక స్థితిగతుల పట్ల సరైన అవగాహన , అనుభవం వున్న కయిత్రి, ఈ చీకటి సమాజంలో వెన్నెల రావడంకోసం, తేవడం కోసం చేసిన యత్నమే ఈ కవిత్వం,  సముద్రం ఉప్పొంగిన గుండెతో పరవశించాలంటే వెన్నెలరేఖలే కావాలి. సమాజం ఉన్నత చైతన్యంతో వెలుగొందాలంటే, వెన్నెలలాంటి స్వచ్ఛమైన మానవ హృదయాలే కావాలన్న కవియత్రి భావగాఢతను ప్రశంసిస్తూ నిరంతరం ఇలానే కవిత్వాన్ని రాయాలని అభిలషిస్తున్నాను.

No comments:

Post a Comment