Wednesday 21 September 2011

జాలాది విజయ స్వచ్ఛమైన కవిత్వాక్షరాలు


భూమిక October 2010
శిలాలోలిత
డా.జాలాది విజయ ‘నగ్నాక్షరాలు’ అనే పేరిట కవితా సంపుటిని 2008లో వేశారు. రగులుతున్న దు:ఖంతో వున్న స్త్రీ ముఖ చిత్రంతో పోరాట పటిమను కనబరుస్తున్న దృశ్యాన్ని అక్బర్‌ అద్భుతంగా చిత్రించారు. కృష్ణాజిల్లా పులపర్రులో జన్మించిన ఈమె ప్రస్తుతం, శ్రీ సిద్ధార్థ విద్యా సంస్థలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తన కన్న తండ్రి జానపద మహాకవి ఐన ‘జాలాది’పై ఎం.ఫిల్‌, పి.హెచ్‌డి చేశారు.
ఈ కవిత్వంలో రకరకాల భావాల సమ్మేళనం వుంది. వస్తువైవిధ్యం వుంది. స్త్రీల సమస్యలపై జీవితాలపై రాసిన కవితలలో కత్తికంటె పదునైన భావతీవ్రత వుంది.భావగాఢతా వుంది. ప్రేమ, విరహం నిరీక్షణ వంటి కవితలు ప్రారంభంలో రాసినవై వుంటాయి. వాటిల్లో కొంత సరళత, మామూలు ధోరణే వున్నాయి. కానీ, స్త్రీల మానసిక ఘర్షణను చిత్రించేటప్పుడు మాత్రం కవయిత్రి విజయ ఒక ప్రవాహ వేగంతో రచిస్తూ, పోలికలపై పోలికలు చెబ్తూ పోయారు.
ముందుగా, ‘ఎందుకు’? కవిత గురించి మాట్లాడుకుందాం. మహిళా దినోత్సవాలు జరుపుకోవడం ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఉధృతమైన ఆవేశంతో రాసిన కవిత ఇది. డబ్బున్న స్త్రీలపై, అగ్రకులాలలో వున్న స్త్రీల (కొందరు మాత్రమే, అంటే ఒకళ్ళిద్దరే)పై దాడి సరైంది కాదు. వస్త్రధారణ అనేది వ్యక్తిగతం. స్త్రీలందరం ఒకటనుకోవాలి. స్త్రీలకంటే ముందు మనం మనుష్యులం. మానవత్వం వున్న వ్యక్తులం. మనలో మనకి విభేధాలు సృష్టించాలను కునే వాళ్ళకు మన మాటలే ఆయుధాలౌతాయి. అతి ధోరణిని ప్రదర్శించే ఒకళ్ళిద్దరు స్త్రీల గాటన  అందరి స్త్రీలను కట్టడం ధర్మం కాదు. పుట్టుక మన చేతుల్లో లేదు. పుట్టిన తర్వాత ఎలా జీవిస్తున్నాం. ఎలాంటి భావాలున్నాయి అన్నది ప్రధానం. ఇంత మంచి పరిణితి వున్న కవయిత్రి గళంలో ఇలాంటి నిరసన బాధాకరం అన్పించింది. ‘నేను స్త్రీవాదిని కాను అమ్మవాదిని’ అని ప్రకటించారొక కవితలో. స్త్రీవాదమంటే అదొక  నేరమో, పాపమో, విశృంఖల జీవితమో కాదు. ఆత్మగౌరవ పోరాటం. మన చుట్టూ వున్న కోట్లాది స్త్రీల సమానత్వం కోసం, అస్తిత్వంకోసం, ఆర్థిక దోపిడీని నిరోధించడం కోసం, ఆరాట పడ్తూ పోరాడుతున్నదే స్త్రీవాదం. స్త్రీలలో వున్న బహురూపాల్లో అమ్మరూపం ఒకటి. మాతృత్వ ప్రదర్శన, త్యాగాల కిరీటాలు మోయడమే స్త్రీతత్వం కాదు. మానవత్వాన్ని స్త్రీ పురుషులిరువురూ నింపుకుని, సాటి మనుషులుగా గుర్తించమనే చెబ్తోంది. ఇవన్నీ విజయగారికి తెలియవని కాదు. ఈ దృష్టితో ఆలోచిస్తే, మనమంతా ఒకటనే భావన పెంపొందించుకొంటే ఇంకెన్నో మంచి కవితలు రాయాలని, రాస్తారని నా నమ్మకం. రావూరి భరద్వాజగారి ముందుమాటలో, డా. జయరావుగారి వెనకమాటలో కూడా  ”ఇది స్త్రీవాదం కాదు, అమ్మవాదం’ అంటూ ప్రస్తావించారు. అమ్మవాదం అంటే ఏమిటి? ప్రేమమయమైన స్త్రీ తత్వమనే కదా! స్త్రీవాదం అంటే స్త్రీ చైతన్యమే. స్త్రీల కొరకు పడే తపనే. స్త్రీల సమస్థితి కోసం పోరాటమే. మనని మనం అర్థం చేసుకునే తీరులోనే వుందంతా. పక్కవాళ్ళు రాళ్ళేయడం చూస్తూనే వున్నాం. మన మీద మనమే రాళ్ళేసుకోవద్దనేదే నా భావన.
బతకడానికే రోజుని కోల్పోయిన స్త్రీలు, అలమటిస్త్తూ, ఆరాటపడ్తూ, పోరాడుతున్న స్త్రీలు, తమ విజయాల్ని, తాము సాధించుకున్న హక్కుల్ని తాము పొందుతున్న భావస్వేచ్ఛనూ, నిర్ణయ ప్రకటనల్ని వెలిబుచ్చుకునే రోజుగా, తాము సాధించుకున్న రోజుగా మహిళా దినోత్సవాన్ని ఎందుకు అనుకోకూడదు?
విజయ తన కవిత్వతత్వాన్ని గురించి ఎంతో భావోద్వేగంతో ‘జ్వాలితాక్షరాలు’ అంటూ చెప్పారు.’నడిబొడ్డున పెట్టిన పొలికేక హోరు నా జాతి గుండెలో మండుతున్న అగ్ని కణాల జ్వాల మదిని ముంచుతున్న కన్నీటి ప్రవాహాల సుడిగుండాల ఉప్పెన. క్షణక్షణం వేధిస్తూ నా చుట్టూ ముసురుకున్న జవాబులేని ప్రశ్నలు. మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న మనస్సు మూలుగు నాతోబుట్టువుల రుధిరాక్షర సంతకాలే ఈ ‘నగ్నాక్షరాలు’. నాలో ఉబుకుతున్న.. ఉరుకుతున్న ఎర్రకణాల ఉప్పెనే ఈ ‘నగ్నాక్షరాలు’. ఆక్రోశంతో అలసిన మనసుతో మీ ముందుకు వస్తున్న అలుపెరగని పోరాటం చేస్తున్నా. సరిలేని నెత్తుటి బిందువుని సవరించే చిరు ప్రయత్నం.’ ఆమెకున్న సంస్కారం, తపన, ఆర్తి, వినయం మన కిందులో ప్రస్ఫుటమౌతున్నాయి.
విజయ వాళ్ళ నాన్న మీద రాసిన కవిత ‘రుద్రాక్షరం’. అత్యుత్తమైన జానపద సాహిత్యాన్ని అద్భుతంగా రచించిన ప్రజలకవి ఆయనంటే నాకెంతో గౌరవం కూడా. ‘బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో/ గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో’-లాంటి వాస్తవ సత్యాలెన్నింటినో ఎంతో కరుణార్ద్రంగా వెల్లడించారు.
ఆశ, ఆఖరి ప్రయాణం, నీలాగే , రాజీనామా, నమ్మకం మోసపోయింది, శూన్యమైన మనస్సు మీద, మృత్యుతరంగాలు, కలల మేడలు, అంతిమ విజయం ఎవరిది? ఎదురు చూపు, అమృతవర్షం, నా అక్షరాల సాక్షిగా వంటి మంచి కవితలెన్నో ఇందులో వున్నాయి. ‘మరో ప్రపంచంకోసం’ కలలు కంటూ ఆశావహ దృక్పథంతో ఈ కవయిత్రి ఎదురు చూస్తోందిలా.
‘ఇంకిన బిందువులా/ ఇంకుతున్న బంధువులా/ జంకులేని నెత్తురు బిందువులా/ మరో ప్రపంచంకోసం/ ఎదురుచూస్తున్నా!

No comments:

Post a Comment