Thursday 20 October 2011

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

భూమిక September 2010
శిలాలోలిత
”కవిత్వం అభిరుచికి సంబంధించిన విశిష్ట కళ. రాయకుండా ఉండలేక పోవడమే కవిత్వానికి మూలసూత్రం. వచన కవిత్వానికి నిర్దిష్ట సూత్రాలంటూ ఏమీ లేవు. అంతరంగ మథనమే వచన కవితకు ఆధారం”- రాజేశ్వరి దివాకర్ల.
ఇవే భావాలతో నిత్య నూతనమైన కవిత్వ రచనలో కొత్త కోణాలను దర్శించాలనే తపన రాజేశ్వరిగారి కవిత్వంలో కనిపిస్తుంది. 2009లో ‘భూమి తడిపిన ఆకాశం’ అనే కవిత్వ సంపుటిని తీసుకొని వచ్చారు.
ఈమె ఉభయ భాషా కవయిత్రి. మూడు దశాబ్దాలుగా బెంగుళూరులోని తెలుగు సాహిత్య రంగంలో సృజనాత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు కన్నడాల గురించి తులనాత్మకమైన వ్యాసాలు రాశారు. ఇంతకు ముందు ‘నీరు స్తంభించిన వేళ, ‘నక్షత్ర దాహం’- కవిత్వ సంపుటులను తీసుకొచ్చారు.ఈ మూడింటి పేర్లతో ప్రకృతి, ఆకాశం,నక్షత్రాలు, నీరు, సమయం, స్తబ్ధత, తృష్ణ, పిపాస, భూమి, ఆర్ద్రత మొదలైనవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ మాలికలో ఈమె రచించిన ‘అక్క మహాదేవి’ ప్రచురితమైంది. అలాగే ‘బసవన్న సమగ్ర వచనాలు’ తెలుగు అనువాదాన్ని అంబికా అనంత్‌తో కలిసి చేశారు. స్త్రీ శరణుల వచనాలు’ అనువాదంలో భాగస్వామ్యం వహించారు. రాజేశ్వరి బసవ సమితి వారి ‘బసవ పథం’ త్రైమాసిక తెలుగు పత్రికకు ప్రధాన సంపాదకులుగా వున్నారు. ‘చైతన్య కవిత’ పత్రికకు చేదోడుగా వున్నారు.బెంగుళూరు ప్రభుత్వ కళాశాలో ఆచార్య పదవిని నిర్వహించి నివృత్తిని పొందారు. మంచి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నారు. స్త్రీ సంవేదన ప్రధానంగా కవిత్వం రాస్తున్న రాజేశ్వరి మార్దవమైన అభివ్యక్తికి వర్తమాన నిదర్శనంగా వున్నారు.
బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో మొదటి మహిళగా పిహెచ్‌.డి.ని పొందారు. రాజేశ్వరి తండ్రిగారు సుప్రసి ద్ధులైన దివాకర్ల వేంకటావధానిగారు అవడంవల్ల అటు ప్రాచీన సాహిత్యంపై పట్టును సాధించగలిగారు. ఆధునికసాహిత్యంపట్ల మమకారాన్ని, అనువాద రచనలపట్ల మక్కువను చూపగలుగు తున్నారు.
రచయిత్రుల మీద రాసిన కవిత ‘నిన్నటివాళ్ళు’ లో ‘రాసుకునేందుకు/ కాగితం కలమైనా లేకున్నా/ గడ్డిపోచనందుకుని/వెలుగుదారిని వెతికారు/గృహస్వేద మాధ్యమంలో/ అక్షరాలను ఒత్తిడి చేశారు/… బాలవితంతువులు/ఆత్మదు:ఖగాయాలను/ శరీరం పిట్టగోడ మీద ఆరేసుకున్నారు./.. మార్పు రావలసిన కాలాలకు/ సాక్ష్యంగా నిలిచారు’.
ఒక సామాజిక బాధ్యతగా రచనను స్వీకరించి స్త్రీల జీవితాల్లోని చీకటి కోణాలను, అసమానతలను వివరిస్తూ రచించడాన్ని సమర్ధించారు. ‘ఆత్మధైర్యం అవతరించాలి/..స్వయంసిద్థ వ్యక్తిత్వం/ నాతోడుగ నిలవాలి/ నేను ఒంటరిని కానని/ నిరూపించాలి/ అనేక పుట్టుకలతో నేను ఒక్కటి కావాలి, స్త్రీలలో ఏర్పడిన చైతన్యం శిశిరపు అంచుల్ని ఒడిసి పట్టుకొని కవిత్వీకరించారు.
పదవీ విరమణ రోజున తన మనస్సులోని మానసిక సంచలనాన్నింటినీ ‘మెట్లు దిగుతూ’.. కవిత్వంలో ఎంతో ఆర్ద్రంగా రచించారు. విదేశాలకు వలస వెళ్ళి పోయిన పిల్లల్ని తలుచుకుంటూ, శరీర మాత్రులు మిగిలున్న వాళ్ళు ‘ఊటలేని చిరునవ్వు’ని కంటి ముందు నిలిపారు. సాలీడు అల్లుకున్న గూట్లో/ తానే చిక్కుపడినట్లు/ అధిక ధరలను చుట్టూ పేర్చుకుని/ గుండెదడను పెంచుకుంటుంది/తరగతుల భావనను వదిలి/మనోగతిని దిద్దుకుంటే/వజ్రా యుధంకాదా/ మధ్యతరగతి మహిళ-జీవన నిర్ణయాన్ని తీసుకునే శక్తి స్త్రీలకుందని నిర్ణయ ప్రకటన చేస్తుంది. తనను తాను తరచి చూసుకున్నప్పుడే, నిజమైన వ్యక్తిత్వం ఏర్పడుతుందని భావించి- ‘నాతో నేను మాట్లాడుకునే/ సందర్భంలో మాత్రం/ నన్ను నేను నిలదీసుకుంటాను, అంటున్నారు? ‘ఆమె - అతడు’ వ్యంగ్య కవిత. కల్పనా చావ్లా మీదా, ఉద్యోగస్థురాలి పిల్లల ఒంటరితనం మీద, తండ్రిని కోల్పోయిన పిల్లల మానసిక స్థితిని, చిత్రిస్తూ కవిత లున్నాయి. చివరికి మిగిలేది? భూమి తడిపిన ఆకాశం, ఒకరినొకరు, రెండు అద్దాలు ఒకే దృశ్యం, పొద్దుటి వెన్నెల, అలిప్త బిందువు వంటి మంచి కవితలున్నాయి. చివరగా రాజేశ్వరి కవిత్యోద్దేశ్యాన్ని తెలిపిన మంచి కవితొకటుంది. ‘విరోధా భాసం’-అది. ‘నాలోపలి దిగులు, భయాలను / ఎదిరిస్తుంటాను/ శిఖరాలను ఎక్కాలని కాదు/ భూమిపై నా కాళ్ళను గట్టిగా నిలపాలని/ నేనంత దూరం నడవలేనని/ జాలి చూపిన వాళ్ళను దూరం నిలిపి/ ముందుకు పోవాలన్న /ధ్యేయంతో తలపడుతుంటాను?.
రాజేశ్వరి కవిత్వం ఒక భావోద్విగ్నతకు గురి చేస్తుంది. ఆమె ‘లో చూపు’, ‘చుట్టు చూపు’ ఆమె పరిణిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మంచి అనువాదకురాలిగా పేర్గాంచిన ఆమె సాహితీ ప్రయాణం ఈ విరామ సమయంలో ద్విగుణీతమవ్వాలని ఆశిస్తున్నాను. సరళమైన భాషతో, చిక్కని భావాలతో, స్పష్టమైన అవగాహనతో రచించిన రాజేశ్వరి సర్వదా అభినందనీయురాలే.

No comments:

Post a Comment