Friday 2 December 2011

పద్మలత పలవరింత, కలవరింత-’మరోశాకుంతలం’

భూమిక April 2010
శిలాలోలిత
శకుంతల ప్రకృతిలో పూచిన పువ్వు. అడవి సౌందర్యం ఆమె సొత్తు. కల్లాకపటం మాయామర్మం తెలీని, అణువణువున ప్రేమను నింపుకున్న అద్భుతమైన సౌందర్యాన్ని ప్రోది చేసుకున్న సీతాకోకచిలుక.కణ్వ మహర్షి ప్రేమామృత ధారలలో తడిపిన పద్మం. అలాంటి శకుంతల  దుష్యంతుని ప్రేమోద్దీపనలతో గొప్ప రసానందాన్ని అనుభవించింది. ప్రేమ తప్ప మరేదీ జీవితంలో శాశ్వతం కాదని నమ్మింది. తనను గుర్తించ నిరాకరించిన దుష్యంతునితో, ఆత్మగౌరవపోరాటం చేసింది. ఒక అద్భుతమైన వ్యక్తిత్వమున్న స్త్రీగా, ఆత్మాభిమానానికి నిదర్శనంగా  నిలిచింది. అలనాటి ఆ శకుంతల గాధే ఇప్పుడు ‘మరో శాకుంతలం’గా మన ముందుకొచ్చింది. ‘పద్మలత’ ఈ కవితాక్షరాలనన్నింటినీ ‘మరో శాకుంతలం’గా ఒక్క  చోట చేర్చి మననీ చూడమంది. అబ్బూరి ఛాయాదేవిగారు ఫోన్‌ చేసి ‘మరో శాకుంతలం’ మీద అభిప్రాయం రాయకూడదూ’ అన్నారు. పుస్తకం చేతిలోకి తీసుకోగానే, జింక పిల్లల్లాంటి, కుందేటి మెత్తని చర్మం లాంటి చేపపిల్లల కదలికల్లాంటి, పారిజాతపు పరిమళాల్లాంటి, పదునైన బాకుల్లాంటి, నలిగిన మల్లెపువ్వుల్లాంటి అక్షరాలు, ఉద్వేగ భరిత ఊహాలోకాల్లోకి, పద్మలత కవిత్వంలోకి లాక్కెళ్ళి పోయాయి. చాలాకాలం తర్వాత ఒక ఫ్రెష్‌ పొయిట్రిని చదివిన అనుభూతి కలిగింది. ‘రేవతీదేవి’ స్ఫురించింది. రేవతీదేవి 79 లో రాసిన ‘శిలాలోలిత’ కావ్యం తర్వాత మళ్ళీ 2010లో పద్మలత ఒక ఉద్వేగ సంభాషణను మన ముందుంచింది.
ఒక హృదయం, మరో హృదయాన్ని స్వచ్ఛంగా, ప్రేమోన్మత్తతతో ఆలింగనం చేసుకోవడానికి పడే తపన ఇందులో ప్రతి అక్షరంలోనూ కన్పించింది. రేవతీదేవి కవిత్వానికీ పద్మలత కవిత్వానికీ చాలా దగ్గర పోలికలున్నాయి. నిజాయితీగా నిర్భయంగా ఏ సెన్సారింగుకు లోబడకుండా, సంఘర్షణ నిండిన భావసంపదతో మనముందు కవిత్వాన్నుంచడం, శారీరక సంచలనాల సవ్వడులను మళ్ళీ మళ్ళీ అనుకోవడానికే తమ గుండెకు సైతం పరదాలేసుకునే ధోరణికాక, ఏ ఆచ్ఛాదనలు లేకుండా ఆరు బయట ఆకాశంకింద మెరిసే నక్షత్రాల్లాంటి నిజాయితీతో కూడిన అక్షరాలకు ప్రాణం పోశారు. ‘జీన్‌పాల్‌ సార్త్రే’ ప్రభావం రేవతీదేవి మీద బలంగా వుంది. పద్మలతలోనూ ఆ ఛాయలు కన్పించాయి.
ఈ ‘మరో శాకుంతలం’శీర్షికలు లేవు. అంతా ఒక శరీరమే ఒక నిర్మాణమే. కాని చెపుతున్న అంశానికి ప్రత్యేక కోణం మాత్రం వుంది. ఏ ఒక్కటీ విడివిడి కవితలుగా కాక, అన్నింటా ఏక సూత్రతే వుంది. కవిత్వమందామా? జీవితమందామా? కొన్ని లక్షల స్త్రీల హృదయాంతర్గత వేదనా రూపమందామా? ఏదైనా అనుకోవచ్చు. ఎవరికి కావలసిన అక్షరాన్ని, అర్ధాన్ని వాళ్ళు తీసుకోవచ్చు.
నిజానికి చిన్న చిన్న పదాలతో లోతైన భావాన్ని వ్యక్తీకరించడం చాలా కష్టం. పద్మలత చాలా మామూలు మాటల్తో, వాక్యాల్తో, ఉద్దీపన కలిగించే భావాల్తో, దేన్నయినా సాధించగలం అనే స్పష్టమైన అవగాహనతో ఈ కవిత్వం మనముందుంచింది. స్త్రీని బలహీన మనస్కురాలుగా కాక, ఒక బలమైన మనిషిగా, ఆత్మవిశ్వాసమున్న మూర్తిగా నిలిచిన ఎదిగిన క్రమాన్ని ఈ కవిత్వంలో పొదిగింది.
ప్రేమంటే ఏకపక్షం కాదనీ, కోరికంటే కేవలం కామవాంఛేకాదనీ, స్త్రీ పురుషులు ఒకరిపట్ల ఒకరు గొప్ప ప్రేమ భావనతో, సృష్టికందని ఆనందాన్ని పొందే గొప్ప రసైకచర్య అని భావించింది. ఆమెలోని వేదాంతి పైపై మెరుగుల మాలిన్యాలనన్నింటినీ క్షాళనం చేయాల్సిన అవసరాన్ని చెప్పింది. ప్రేమే జీవితానికి వెలుగు. ఈ సృష్టిలో డబ్బుతో దేన్నయినా సాధించవచ్చు అనుకుంటారు. కానీ కాదు. ప్రేమనూ, గురువునూ మాత్రం డబ్బుతో పొందలేం’ - ఇదే భావననూ, ప్రేమ రాహిత్యం మనిషినెంత ఉద్వేగానికి గురి చేస్తుందో ఈమె కవిత్వం చెబుతుంది. ఎంతో లలితమైన పదాలు పట్టుకుంటే, ముట్టకుంటే నొప్పి కలుగుతుందేమో అన్నంత భావసౌకుమార్యం, ప్రాచీన సాహిత్యాన్నీ,  చలం లాంటి ఆధునికుల్నీ తనలో ఇముడ్చుకున్న ఈ కవయిత్రి పలవరించినవన్నీ కవితలై  కూర్చున్నాయి. ఈమె కవిత్వంలో స్థలకాలాల పరిమితి లేదు. అందువల్ల శాశ్వతంగా  నిలిచే పోయే గుణం వచ్చింది.
గుండ్రంగా తిప్పి/కావాల్సినవైపు/కాస్తకాస్తగా/ కోసుకోవడానికి/ నేను మనిషిని.
వెలుతురొచ్చిన ఉత్సాహంతో/బుర్రంతా కడగానా/మనసే సాలిపురుగని తెలిసి/ఆ ప్రయత్నం విడిచాను.
ఆశ్చర్యం/మొసళ్ళ మధ్య ఈదుతూ నేనుంటే/ఆనందం ఆ ఒడ్డునచేరి/హాయిగా నవ్వుతోంది. ఇంకెంతలే/ అంతం లేని కాలంలో నేనెంత/ ఇవాళే నిజం కానపుడు/రేపటి గురించి/ వివాదమెందుకు.
నీవు విడిచివెళితే/ ఘనీభవించి/మళ్ళీ మనిషైయ్యాను.
ఓటమిని పద్మలత కవిత్వం అంగీకరించదు. అనేక పార్శ్యాలలో జీవితాన్ని దర్శించిన తర్వాత, ఆటుపోటులకు గురైన స్త్రీమూర్తి, తన జీవితాన్ని కాంతిమయం చేసుకున్న తీరును ఈ కవిత్వం ప్రతిఫలించింది. మనిషిగా జీవించడమే ప్రధానం. స్వేచ్ఛ ఆయువుపట్టు. ప్రేమ ఒక్కటే నిజం. జీవితం చాలా చిన్నది. ఎదురైన ఘర్షణలతో, అపజయాలతో ఎదురొడ్డి నిలిచి సాధించుకున్న వెలుగు జీవితానికర్ధం అన్న జీవన వాస్తవికతలనెన్నింటికో ఆలవాలమైంది ఈ కవిత్వం. సుకుమారమైన స్థితి నుండి ఘనీభవరూపం వరకు సాగిన మానవ యాత్రే ఈ కవిత్వం. మజిలీ మజిలీలో మనిషి సాధించుకోవాల్సిన జీవనమూల్యాన్ని తెలియజెపుతుంది ఈ కవి

1 comment:

  1. Padma Latha's poetry is libertarian and at the same time liberatory! This is really a rarity!! - Nellore Narasimha Rao

    ReplyDelete